బంగారం ధరలు… భారత దేశంలో బంగారంనికి ఎంత విలువు ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉన్నోడు, లేనోడు అని తేడాలు లేకుండా అప్పు చేసైనా సరే బంగారం కొనుగులో చేస్తుంటారు. ఇక గత కొంత కాలంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఇటీవలే బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త చరిత్ర సృష్టించాయి. ముఖ్యంగా వెండి ధర చరిత్రలో తొలిసారిగా కిలోకు రూ.2 లక్షల మైలురాయిని దాటి ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరింది. బంగారం ధరలు కూడా అదే బాటలో పయనించి భారీగా పెరిగాయి. కాగా ప్రస్తుతం బంగారం ధరలు వచ్చే నెల అంటే డిసెంబర్ లో భారీగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక విషయంలోకి వెళ్తే..
గత రెండు మూడు రోజులుగా.. ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అక్టోబర్ నెలలో ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరిన తర్వాత ఈ తగ్గుదల నమోదైంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, ట్రంప్-జిన్‌పింగ్ చర్చలు సానుకూలంగా సాగడం, దేశంలో పండుగల సీజన్ ముగియడం వంటి పరిణామాలు స్వల్పకాలంలో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపాయని పీఎల్ క్యాపిటల్ డైరెక్టర్ సందీప్ రైచురా విశ్లేషించారు. బంగారం ధరలు వరుసగా రెండో వారం కూడా తగ్గుముఖం పట్టాయి. డాలర్ విలువ బలపడటం, అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై సానుకూల సంకేతాలు వంటి అంశాలు పసిడి ధరల పతనానికి కారణమయ్యాయి. ఇటీవల తులం (10 గ్రాములు) 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,25,000 దాటి రికార్డు సృష్టించగా, ప్రస్తుతం అది రూ.1,23,000 వద్ద స్థిరపడింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. రెండు వారాల పాటు ఒడిదుడుకులకు లోనైన వెండి, ఇప్పుడు స్థిరత్వం దిశగా పయనిస్తోంది. అక్టోబర్‌లో కేజీ వెండి ధర రూ.2 లక్షలు దాటగా, ప్రస్తుతం రూ. 1.66 లక్షలకు తగ్గింది. ఈ ధర మరింత తగ్గే అవకాశం ఉందని స్నేహ జైన్ అభిప్రాయపడ్డారు. అయితే, భవిష్యత్తులో ధరల తగ్గుదల అనేది స్థూల ఆర్థిక డేటాపై ఆధారపడి ఉంటుందని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలు లోహాల మార్కెట్‌ను ప్రభావితం చేశాయని వెంచురా కమోడిటీస్ హెడ్ ఎన్ఎస్ రామస్వామి పేర్కొన్నారు. అందువల్ల, పసిడి ధరలలో ఊహించని మార్పులు జరిగే ఆస్కారం ఉందని ఆయన స్పష్టం చేశారు.
దేశంలో బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నవంబర్ 3వ తేదీ సోమవారం రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.123,140కి పడిపోయింది. గత వారంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,620, 22 క్యారెట్ల బంగారం రూ.2,400 తగ్గింది. గ్లోబల్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర గరిష్ట స్థాయి నుంచి 4,000 డాలర్ల స్థాయికి పడిపోయిందని వెల్త్ ట్రస్ట్ క్యాపిటల్ సర్వీసెస్ సీఈఓ స్నేహ జైన్ తెలిపారు. డిసెంబర్ నాటికి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.