నందమూరి బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే టాలీవుడ్లో ఒక ప్రత్యేక హంగామా అని ప్రేక్షకులు అనుకుంటారు. ఈ జంట అందించిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు బాక్సాఫీస్లో పెద్ద విజయాలను సాధించాయి. ఇప్పుడు అదే మాస్ ఎమోషన్ను మరింత భారీ స్థాయికి తీసుకెళ్తూ ‘అఖండ 2’ను రూపొందిస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ పై అంచనాలు ఆకాశానికి ఎగబాకాయి. ఇటీవల విడుదల చేసిన ‘అఖండ 2’ ఫస్ట్ గ్లిమ్స్ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తూ అభిమానుల్లో తీరని ఉత్సాహాన్ని రేపింది. బాలయ్య శక్తివంతమైన అఘోర లుక్, బోయపాటి డిజైన్ చేసిన ఘనమైన యాక్షన్ టోన్ కలిసి ఆకట్టుకునేలా ఉండడంతో ఈ సినిమా చుట్టూ నెలకొన్న హైప్ మరింత పెరిగింది. కాగా ఇప్పుడు అఖండ-2 సినిమాను 3Dలోనూ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫ్యాన్స్‌కు కొత్త అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఫార్మాట్‌లోనూ తీసుకొస్తున్నట్లు బోయపాటి చెప్పారు. ‘ఈ చిత్రం దేశ ఆత్మ, పరమాత్మ. సనాతన ధర్మం ఆధారంగా మూవీని రూపొందించాం. ఈ సినిమాను దేశమంతా చూడాలనుకుంటున్నాం. అందుకే ముంబై నుంచి ప్రచారం ప్రారంభించాం’ అని పేర్కొన్నారు.