గత కొన్ని రోజులుగా తెలంగాణ (Telangana), కర్ణాటక, మహారాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy rains) కుంభవృష్టిని కురిపిస్తున్నాయి. ఇక ఎగువన మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదీ పరీవాహక ప్రాంతం ఉగ్రరూపం దాల్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు 12.220 మీటర్ల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ఎగువ నుంచి రావడంతో.. కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్ట్లో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ (Medigadda Lakshmi Barrage) పూర్తిగా నిండుకుండలా మారింది. భారీగా వరద పోటెత్తడంతో మొత్తం 85 గేట్లు ఎత్తి, దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో రెండూ 9,02,550 క్యూసెక్కులుగా నమోదయ్యాయి.
భద్రాచలం వద్ద ఉగ్ర గోదారి..
ఇక ప్రస్తుతం భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి (Godavari) నదికి వరద భారీగా పొట్టెత్తడంతో.. గోదావరిలో నీటిమట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసి, నదీతీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం, భద్రాచలం వద్ద గోదావరి నదిలో 9,40,345 క్యూసెక్కుల (9,40,345 cusecs) వరద ప్రవాహం నమోదైంది. ఈ భారీ ప్రవాహం కారణంగా భద్రాచలంలోని స్నానఘట్టాలు (Baths) పూర్తిగా నీట మునిగాయి. వరద నీరు కళ్యాణకట్టను కూడా తాకింది. ఈ నేపథ్యంలో భక్తులు ఎవరూ స్నానాల కోసం నదిలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పర్ణశాలలో కూడా వరద ప్రభావం తీవ్రంగా ఉంది. ఇక్కడ సీతమ్మ నారచీరల ప్రాంతం(Linen area) మరియు సీతమ్మ విగ్రహం కూడా వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో.. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ తీరంలో ఉన్న చిన్న వ్యాపారస్తుల దుకాణాలను ఖాళీ చేయించారు. అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 40 గేట్లు ఎత్తి, 2 లక్షల 49 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ 1 లక్ష 75 వేల క్యూసెక్కులు కాగా, నీటి మట్టం ప్రస్తుతం 1087.10 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు. మొత్తం సామర్థ్యం 80.5 టీఎంసీలు, ప్రస్తుతం నిల్వ 66.783 టీఎంసీలుగా ఉంది.
నిండు కుండలా.. నిజాంసాగర్
ఇక ఇదే కాకుండా.. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు (Nizamsagar Project) కూడా వరద నీరు వస్తోంది. అధికారులు 16 గేట్లు ఎత్తి, 75 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో రెండూ 75 వేల క్యూసెక్కులు. ప్రస్తుతం నీటిమట్టం 1403.50 అడుగులు, పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు. మొత్తం నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు, ప్రస్తుతం నిల్వ 15.667 టీఎంసీలుగా ( TMC ) ఉంది. ఈ వరదల కారణంగా ప్రాజెక్టులు వరుసగా నిండుకుండలా మారుతున్నాయి. అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.