- హిమాచల్ ప్రదేశ్ ను ముంచెత్తిన వరదలు..
- మండి జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న ఆక్మిక వరదలు
- కొట్టుకుపోయిన రోడ్లు, వాహనాలు..
- లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిన వరద
- బియాస్ నది వెంట విరిగిపడ్డ కొంచరియలు
- మనాలి – చండీఘర్ రహదారిపై భారీగా నిలిపిచోయిన ట్రఫిక్
- రాంబన్ సెక్టార్ లో విరిగిపడ్డ కొంచరియలు
- జమ్ము – శ్రీనగర్ జాతీయ రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు
- మనాలి – లే లఢక్ రహదారి మూసివేత
- ఒక్క రోజులో 115 నుంచి 204 మి.మీ వర్షపాతం నమోదు
- హిమా – జల్ ప్రదేశ్ గా మారిపోయిన హిమాచల్
- మెరుపు వరదలతో చిగురుటాకులా వణుకుతున్న రాష్ట్రం
- భారీ వరదలతో రాష్ట్ర వ్యాప్తంగా 75 కి చేరిన మృతల సంఖ్య
- ఫ్లాష్ ప్లడ్స్ తో తీవ్రంగా దెబ్బతిన్న మండి జిల్లా
మనాలిలో.. ఫ్లాష్ ప్లడ్స్..
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా అక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నాయి. పండో ఆనకట్ట దగ్గర కొండ చరియలు విరిగిపడటంతో చండీగఢ్, మనాలీ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కొండ చరియలు విరిగిపడుతున్న సమయంలో అటుగా వెళ్లిన ఓ కారు బోల్తా పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

70 రోడ్లు మూసివేత..
కొండచరియలు విరిగిపడటంతో మండి- కులు హైవే మూసివేశారు. దీంతో రోడ్డు రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం (SEOC) ప్రకారం, గురువారం నాడు 291 రోడ్లు దిగ్భంధించబడ్డాయి. మండి జిల్లాలో అత్యధికంగా 171 రోడ్లు వరదలతో స్తంభించిపోయాయి. గత నెలలో సంభవించిన ఆకస్మిక వరదల్లో విస్తృతంగా నష్టపోయిన జిల్లా మండినే. తాజాగా ఫ్లాష్ ప్లడ్స్ తో మండి జిల్లా తీవ్రంగా దెబ్బతింది. మండిలోని సెరాజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 70 రోడ్లు మూసివేశారు. ఆ తర్వాత థాలౌట్ 35, ధరంపూర్ 25, కర్సోగ్ 18 ఉన్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాలు, వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వాటిల్లిందని వివరించారు. మండి జిల్లా కేంద్రంలోని జైల్ రోడ్, జోనల్ హాస్పిటల్ రోడ్, సైంజ్ రీజియన్ తదితర ప్రాంతాల్లో వరదల ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్, మండి డిప్యూటీ కమిషనర్ తదితరులు పర్యటించారు. కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు. వర్ష బీభత్సానికి సంబంధించి స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా.. అవి వైరల్ గా మారాయి.

75 మంది మృత్యువాత..
ఇక భారీ వర్షాలతో.. నదులు, వాగులలో నీటి మట్టాలు పెరగడంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా కోల్ ఆనకట్ట వరద గేట్లను తెరిచారు. సైంజ్ లోయ (కులు జిల్లా)లోని గడా పర్లి పంచాయతీలో, వరద నీరు వంతెనలు, రోడ్లను తుడిచిపెట్టుకుపోయింది. సుమారు నాలుగు గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. గురువారం రాత్రి బియాస్ నది కూడా ప్రమాదకరంగా ఉప్పొంగడంతో, మనాలి సమీపంలోని నెహ్రూ కుండ్ మరియు బాంగ్ నివాసితులు వరదల భయంతో హై అలర్ట్‌గా ఉండాల్సి వచ్చింది. ఈ ప్రాంతం అంతటా వర్షాలు కొనసాగుతున్నందున నివాసితులు, పర్యాటకులు అనవసర ప్రయాణాలను నివారించాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో, శిథిలాల తొలగింపులో రెస్క్యూ సిబ్బంది 24 గంటలూ నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. కాగా, వర్షాలకు పలుచోట్ల కొండచరియలు విరిగిపడడంతో పఠాన్ కోట్ – మండి జాతీయ రహదారి, కిరాత్పూర్ – మనాలి నాలుగు లేన్ల రహదారి, చండీగఢ్ – మనాలి హైవేలు మూతపడ్డాయి. కొండచరియలను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక ఈ భారీ వరదలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 75 మంది మృత్యువాత చెందినట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
