Do you know the special features of Shri Krishna Janmashtami?

హిందువులలో అత్యంత ప్రసిద్ధి చెందిన పండుగలలో ఒకటి శ్రీకృష్ణాష్టమి. విష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్నిపురస్కరించుకొని ఈ పండుగను జరుపుకుంటారు. భారతదేశమంతటా ఉత్సాహంతో, అత్యంత భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహిస్తారు. ఈ పర్వదినాన్ని గోకులాష్టమి, శతమానం ఆటం, శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణ జయంతి, వంటి విభిన్న పేర్లతో పిలుస్తారు. ఇక దేశ వ్యాప్తంగా.. శ్రీ కృష్ణ జన్మాష్టమి ప్రజలందరూ అనందంగా జరుపుకుంటున్నారు. ఈ తరుణంలో ఈ పండుగ ప్రాముఖ్యతను ఒకసారి తెలుసుకుందాం రండి.

శ్రీ కృష్ణ జన్మాష్టమి చరిత్ర

శ్రీ కృష్ణ జన్మాష్టమి, హిందూ మతంలో అతి ముఖ్యమైన పండుగ ల్లో ఒకటి. విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం అయిన శ్రీకృష్ణుని జన్మదినం సందర్భంగా నిర్వహిస్తుంటారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సుమారు 5వేల సంవత్సరాల క్రితం మధురలో జన్మించాడు. ఈ విషయంతో పాటు ఆయన జీవిత కథ, భగవద్గీత, భాగవత పురాణం వంటి గ్రంథాలలో పొందుపరిచారని పండితులు చెబుతున్నారు.

కృష్ణాష్టమి అని ఎందుకు అంటారు ?

శ్రీకృష్ణుడు విష్ణువు 8వ అవతారంలో జన్మించడం, అలాగే దేవకీ మాతకు 8వ సంతానంగా, ఎనిమిదవ తేదీన శ్రీకృష్ణుడు జన్మించాడు. సంస్కృతంలో జమ్నా అనే పదానికి జననం అని అర్థం అలాగే అష్ట అంటే ఎనిమిది. 8వ సంఖ్యకు శ్రావణ మాసంలో కృష్ణపక్షం వస్తుంది. వీటన్నింటి కారణంగా శ్రీకృష్ణుడి పుట్టిన రోజును కృష్ణాష్టమి అనే పేరు వచ్చింది..

శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ ప్రాముఖ్యత ?

హిందూ క్యాలెండర్ ప్రకారం, శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలోని ఎనిమిదో రోజు (అష్టమి తిథి)న జరుపుకుంటారు. ఈ పండుగ సాధారణంగా ఆగస్టు, -సెప్టెంబర్ లో రోహిణి నక్షత్రంలో వస్తుంది. భక్తులు కృష్ణాష్టమి పండుగను భారతదేశంలోనే కాకుండా కొన్ని విదేశాలలో కూడా చాలా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీ కృష్ణ జన్మాష్టమిలోని అత్యంత ఆసక్తికరమైన ముఖ్యమైన అంశం దహీ హండి (ఉట్టి కొట్టే పండుగ). ఉట్టి కొట్టే వేడుక అనేది శ్రీ కృష్ణ భగవానుడికి అత్యంత ఇష్టమైన కార్యకలాపాన్ని వర్ణిస్తుంది. ఇక్కడ యువకుల బృందాలు ఒక పిరమిడ్ను ఏర్పాటు చేసి పెరుగుతో (దహీ) నింపిన మట్టి కుండను (హండి) పగలగొడతారు. శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలోనే కృష్ణ జయంతిని అర్ధరాత్రి వరకు జరుపుకుంటారు. కృష్ణ జననం మరుసటి రోజు, భక్తులు ఉట్టికొట్టే వేడుకలు (దహీ హండి) పండుగను జరుపుకుంటారు.

పండుగను ఎలా జరుపుకుంటాం?

కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాంహంగా వేడుకలను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం పాటించడం, పవిత్రమైన భగవద్గీత శ్లోకాలు వినడం, శ్రీ కృష్ణుని కథను వినడం లేదా పఠించడం ద్వారా భక్తులు శ్రీకృష్ణుని పట్ల తమ భక్తిని చాటుకుంటారు. శ్రీకృష్ణుని ఆలయాలను పూలమాలలు, అలంకార వస్తువులతో అలంకరిస్తారు. కృష్ణ జయంతి వేడుకల సందర్భంగా శ్రీకృష్ణుని చిన్ననాటి జ్ఞాపకాలను వర్ణిస్తూ రాధా కృష్ణుల వేషధారణలో ఉన్న చిన్న పిల్లలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. భక్తులు కృష్ణ జననం తర్వాత, అనగా అర్ధరాత్రి తర్వాత, ముందుగా ఆరతి చేసి, ఆ తర్వాత ఇంట్లో తయారుచేసిన స్వీట్లను అందించి తమ ఉపవాసాన్నివిరమించుకుంటారు. ఉపవాసం, పూజ ముగిసిన తర్వాత రుచికరమైన భోజనం తయారు చేసి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు వడ్డిస్తారు. మరి అలాంటి నల్లనయ్యకు కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేసి తరిద్దాం. ఈ కృష్ణాష్టమి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని, విజయాలను తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *