ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ కి విశేషమైన ఆదరణ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక ఇండియాలోనూ అతిపెద్ద రియాలిటీ షోగా ‘బిగ్ బాస్’ కు పేరుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ, మరాఠి వంటి అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఈ షో నడుస్తోంది. ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభిస్తుండటంతో నిర్వాహకులు సరికొత్త సీజన్స్ తో అలరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే తెలుగుతో పాటు కన్నడలోనూ కొత్త సీజన్లు షురూ అయ్యాయి. అయితే కన్నడ ‘బిగ్‌బాస్’కి షాక్ తగిలింది. మంగళవారం నాడు హౌస్‌ను సీజ్ చేశారు. తాజాగా బిగ్‌బాస్ డోర్స్ తెరుచుకున్నట్లు తెలుస్తోంది.
అసలేం జరిగింది..?
కన్నడ బిగ్‌బాస్ షోకు ఎదురైన పెద్ద అడ్డంకి తొలగిపోయింది. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మంగళవారం సీల్ వేసిన బిగ్‌బాస్ హౌస్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ జోక్యంతో తిరిగి తెరుచుకుంది. దీంతో షో నిర్వాహకులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. బిగ్‌బాస్ షో చిత్రీకరణ జరుగుతున్న బిడదిలోని ‘జాలీవుడ్’ స్టూడియో నుంచి ప్రతిరోజూ దాదాపు 2.5 లక్షల లీటర్ల శుద్ధి చేయని నీటిని బయటకు వదులుతున్నారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు షో నిర్వాహకులకు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అయితే, ఆ నోటీసులను నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో, తహసీల్దారు తేజస్విని నేతృత్వంలోని అధికారుల బృందం మంగళవారం బిగ్‌బాస్ హౌస్‌కు బయటి నుంచి తాళాలు వేసి సీల్ చేసింది.

డీకే శివకుమార్ జోక్యం..
ఈ విషయం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. స్టూడియోకు మరో అవకాశం ఇవ్వాలని బెంగళూరు సౌత్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. ”బిగ్ బాస్ కన్నడ’ చిత్రీకరణ జరుగుతున్న బిడాడిలోని జోలీవుడ్ ప్రాంగణంలోని సీల్‌ను ఎత్తివేయాలని బెంగళూరు సౌత్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించాను. పర్యావరణ సమ్మతి అత్యంత ప్రాధాన్యతగా ఉన్నప్పటికీ, కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఉల్లంఘనలను పరిష్కరించడానికి స్టూడియోకు సమయం ఇవ్వబడుతుంది. పర్యావరణ పరిరక్షణ పట్ల మా బాధ్యతను నిలబెట్టుకుంటూనే కన్నడ వినోద పరిశ్రమకు మద్దతు ఇవ్వడానికి నేను కట్టుబడి ఉన్నాను” అని డీకే శివకుమార్ ఎక్స్ లో పేర్కొన్నారు. ఇక ఈ పరిణామంపై షో వ్యాఖ్యాత కిచ్చా సుదీప్ హర్షం వ్యక్తం చేశారు. సరైన సమయంలో జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించినందుకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు, సహకరించిన అధికారులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఇప్పటి వరకు బిగ్‌బాస్ షో అందించిన ఎంటర్‌టైన్‌మెంట్, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు, హౌస్ సీల్ తీసివేయడం వల్ల షో నేరుగా ముందుకు సాగుతుందని, ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.