Flood Water On Railway Track : తెలుగు రాష్ట్రాలపై మొంథా తుఫాను పంజా విసురుతుంది. మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో రైల్వే స్టేషన్లు జలమయమయ్యాయి. డోర్నకల్ జంక్షన్ వద్ద ట్రాక్‌లు నీట మునగడంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం తగ్గితేనే రైళ్ల రాకపోకలు పునరుద్ధరణ అని అధికారులు తెలిపారు.
ఇంకాస్తా వివరాల్లోకి వెళ్తే…
ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ బలహీనపడుతున్నప్పటికీ మొంథా తుఫాను ప్రభావం తెలంగాణపై ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ప్రధాన రైల్వే మార్గాలు, స్టేషన్లు జలమయమయ్యాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల ధాటికి డోర్నకల్ రైల్వే జంక్షన్ వద్ద రైల్వే ట్రాక్‌లు పూర్తిగా నీట మునిగాయి. సుమారు 5 గంటల పాటు కురిసిన వర్షానికి వరద నీరు రైల్వే స్టేషన్‌లోకి భారీగా చేరింది. డోర్నకల్ జంక్షన్‌లో ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపైకి కూడా నీరు చేరింది. రైల్వే ట్రాక్‌లు నీటిలో మునిగిపోవడంతో, ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా పలు రైళ్లను జిల్లా పరిధిలోనే నిలిపివేశారు. దీంతో గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. ఇక సికింద్రాబాద్ నుంచి వరంగల్ మీదుగా విజయవాడ వెళ్లే రైళ్ల రాకపోకలు ఆలస్యం కానున్నట్లు వారు వెల్లడించారు.

రైల్లో చిక్కుకున్న 220 మంది..
ఇక గోల్కొండ ఎక్స్‌ప్రెస్ లో 220 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. గుండ్రాతి మడుగు వద్ద కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను సైతం నిలిపివేశారు. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా ఈ రెండు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను గమనించిన స్థానిక పోలీసులు వెంటనే స్పందించారు. పోలీసు బృందం నిలిచిపోయిన రైళ్లలోని ప్రయాణికులకు బిస్కెట్లు, వాటర్ బాటిళ్లు వంటి అత్యవసర సదుపాయాలను అందించి సహాయం చేశారు. ట్రాక్‌లపై నీరు పూర్తిగా తగ్గిన తర్వాతే రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

ప్రస్తుతం రైల్వే అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నీటి మట్టం తగ్గిన తర్వాత రైళ్ల సాధారణ వేగాన్ని పునరుద్ధరించాలని ఆదేశించారు. దెబ్బతిన్న ట్రాక్‌లను పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయి.