Trains Cancelled : బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను మరియు దాని ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (South Central Railway – SCR) సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా మరియు ట్రాక్‌లపై నీరు చేరడం, విద్యుత్ సరఫరాకు అంతరాయం వంటి కారణాల వల్ల పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించారు. 127 రైళ్లను రద్దు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరో 14 రైళ్లను దారి మళ్లించినట్లు పేర్కొంది. ఫలక్‌నుమా, ఈస్ట్ కోస్ట్, గోదావరి, విశాఖ, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించింది.
ఇక విషయంలోకి వెళ్తే…
ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణను కూడా మొంథా తుఫాను కకావికలం చేస్తుంది. తుఫాను చరిత్రలోనే ఈ మొంథా తుఫాన్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అని ఐఎండీ వెల్లడించింది. ఇక ఈ మొంథా తుఫాన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో భారీగా రైళ్లు రద్దయ్యాయి. భారీ వర్షాల కారణంగా పలు రైల్వే స్టేషన్లలో రైళ్లు నిలిచిపోయాయి. ఇక తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగులో కోణార్క్ ఎక్స్‌ప్రెస్, డోర్నకల్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయాయి. ఏపీలోకి కృష్ణా జిల్లా కొండపల్లిలో సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. ఫలక్‌నుమా, ఈస్ట్ కోస్ట్, గోదావరి, విశాఖ, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లు రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. కాగా.. వర్షాల కారణంగా పలు రైల్వేస్టేషన్లలో ఎక్కడికక్కడే రైళ్లు నిలిచిపోయాయి.
నిలిచిపోయిన 12 గూడ్స్ రైళ్లు…
ఇక మరో 12 గూడ్స్ రైళ్లు ఏపీలో పలు రైల్వే స్టేషన్లలో ఆగిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని రైల్వే శాఖ సూచించింది. రద్దయిన రైళ్ల వివరాలను ప్రయాణికుల మొబైల్‌కు పంపించినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. రద్దయిన రైళ్లలో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తి స్థాయి రిఫండ్ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందే తమ ప్రయాణించాల్సిన రైలు స్టేటస్‌ను తెలుసుకోవాలన్నారు.
