Congress leader Rahul Gandhi's response to the stampede at the Kasibugga temple in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో కనీసం 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర విషాదంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేశారు.

ఈ దుర్ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, “ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణనష్టం జరగడం నన్ను తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి నా ప్రగాఢ సానుభూతి. వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను,” అని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలకు వేగంగా, గౌరవప్రదంగా సహాయం అందించేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యల్లో పాలుపంచుకుని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ ఘటనపై సంతాపం తెలిపారు. “కాశీబుగ్గ ఆలయంలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి” అని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, జనసమూహ నియంత్రణ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఖర్గే నొక్కిచెప్పారు. బాధితుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే తగిన నష్టపరిహారం, మద్దతు అందించాలని డిమాండ్ చేశారు.

ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగి ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. ఘటన స్థలంలో భక్తుల మృతదేహాలు పడి ఉన్న దృశ్యాలు తీవ్రంగా కలిచివేశాయి. స్థానికులు, సహాయక బృందాలు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *