ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాను మళ్ళీ వరదలు ముంచెత్తాయి. బుధవారం రాత్రి నందానగర్ లో ఆకస్మిక వరదలు కారణంగా 10 మంది గల్లంతయ్యారు. చాలా ఇళ్ళు కొట్టుకుపోయాయని తెలుస్తోంది.
ఉత్తరాఖండ్ లో చమోలీ జిల్లా నందానగర్ లో కుండపోత వర్షాలు కురిశాయి. దీని కారణంగా అక్కడ క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఈ భారీ వదలకు నందానగర్ లో 10 మంది గల్లంతయ్యారు. దాంతో పాటూ చాలా ఇళ్ళు, రోడ్లు కూడా కొట్టుకుపోయాయి. దాదాపు ఆరు భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొట్టుకుపోతున్న ఇళ్ళ నుంచి ఇద్దరిని రెస్క్యూ బృందం రక్షించింది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. తప్పిపోయిన 10 మందిలో ఆరుగురు కుంత్రి లగా ఫాలి గ్రామం, ఇద్దరు సర్పాని, ఇద్దరు దుర్మా ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించారు. ఇందులో ఒక 75ఏళ్ళ పెద్దాయన, 10 ఏళ్ళ బాలుడు కూడా ఉన్నారు. ప్రస్తుతం చమోలీలో ఇంకా వర్షాలు కురుస్తుండడంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టమౌతోందని చెబుతున్నారు. అక్కడ ఈరోజు, రేపు మరింత అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
నాలుగు రోజుల కిందట డెహ్రాడూన్ లో..
నాలుగు రోజుల క్రితం రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ లో సంభవించిన మేఘాల విస్ఫోటనం కారణంగా కనీసం 13 మంది మరణించారు. రోడ్లు కొట్టుకుపోయాయి.. ఇళ్ళు, దుకాణాలు దెబ్బతిన్నాయి. రెండు ప్రధాన వంతెనలు కూలిపోయాయి. నగరాన్ని చుట్టుపక్కల ప్రాంతాలకు అనుసంధానించే హైవేలు దారుణంగా తయారయ్యాయి. మరోవైపు కొండప్రాంత రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఉత్తరాఖండ్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడ్డాయి . అక్కడ ముగ్గురు మరణించారు.
సెప్టెంబర్ 20 వరకు వర్షాలే..
ఉతతరాఖండ్ ప్రభుత్వం డెహ్రాడూన్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్‌ల్లో సెప్టెంబర్ 20 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని..జాగ్రత్తగా ఉండకపోతే మరంత ప్రాణనష్టం తప్పదని హెచ్చరిచింది. కొండచరియలు విరిగిపడటం, మౌలిక సదుపాయాలు కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 15 మంది గల్లంతయ్యారు, 900 మందికి పైగా చిక్కుకుపోయారు.