హైదరాబాద్ (Hyderabad) జూబ్లిహిల్స్ (Jubilee Hills) లో ఉన్న మహాన్యూస్ (Mahanews) టీవీ చానల్, కార్యాలయంపై బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు దాడి చేశారు. సడెన్‌గా గుంపులా వచ్చి.. కార్యాలయంపై విరుచుకుపడ్డారు. ఆఫీస్ ఎదురుగా ఉన్న కార్లతో పాటు.. కార్యాలయం లోపలుకు చొచ్చుకు వెళ్లి దాడి చేశారు. రిసెప్షన్ తో పాటు స్టూడియోను కూడా ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల దాడితో ఉద్యోగులంతా భయాందోళనకు గురయ్యారు. దాడి చేయడానికే వచ్చినట్లుగా ధ్వంసం చేసేసి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.
కేటీఆర్ పై తప్పుడు కథనాలు అంటూ ఆందోళన…
ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President) కేటీఆర్ పై తప్పుడు కథనాలు (False stories) ప్రసారం చేశారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు మహా న్యూస్ కార్యాలయంపై బండరాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఇక ఈ దాడిని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మరో వైపు మీడియాపై దాడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లే అని వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు మండిపడుతున్నారు.
బీఆర్ఎస్ శ్రేణుల వాదన…
ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్ పై మహాన్యూస్ లో అభ్యంతరకర విషయాలు వస్తున్నాయని బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఈ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడంతో ఇలా దాడి చేస్తారని మహా న్యూస్ వర్గాలు కూడా అనుకోలేదు.
దాడిపై కేటీఆర్ స్పందన ఇదే..!
మహా న్యూస్ ఛానెల్‌పై బీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో స్పందించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదని అన్నారు. బీఆర్‌ఎస్ (BRS) సోదరులు సంయమనం పాటించాలని అన్నారు. ” ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదు. అలానే అబద్ధాలకు, అసందర్భ ప్రేలాపనలకు, మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు కూడా అస్సలు తావు ఉండకూడదు. కానీ ఈనాటి దిగజారుడు రాజకీయాల్లో అన్ని మెయిన్ స్ట్రీమ్ కి తీసుకొచ్చాడు మన గుంపు మేస్త్రి, అతని అనుంగ మిత్రులు. న్యాయ విధానాన్ని నమ్ముకుందాం. మీ బాధను, పార్టీపై, నాపై ఉన్న ప్రేమను అర్థం చేసుకోగలను. ఇలాంటి బురదజల్లే ప్రయత్నాలపై కోర్టును ఆశ్రయిస్తామంటూ” కేటీఆర్ రాసుకొచ్చారు.
ఏపీ డీప్యూటీ సీఎం ట్వీట్…
మరోవైపు ఈ దాడిపై ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూడా స్పందించారు. మీడియా సంస్థపై ఇలా భౌతికంగా దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. ఇది అత్యంత గర్హనీయమైన చర్య అని అన్నారు. మీడియా సంస్థలు ప్రసారం చేసే వార్తలు లేదా కథనాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటికి కొన్ని పద్ధతులు ఉంటాయని తెలిపారు. డైరెక్ట్‌గా కార్యాలయాలపై దాడులకు దిగడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం అని పేర్కొన్నారు.
Suresh