ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంత కాలంగా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనేక సినిమాలు.. మళ్లీ థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి.. సందడి చేశాయి కూడా.. వాటిలో చాలా చిత్రాలు.. బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో వసూళ్లను రాబడుతున్నాయి. సినీ ప్రియులను ఫుల్ గా అలరిస్తున్నాయి. అయితే బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచి తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన బాహబలి రెండు సినిమాలు.. ఇటీవల ఒక పార్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి విదితమే. రెండు భాగాలు కలిపి ఎడిట్ చేసి బాహుబలి ది ఎపిక్ పేరుతో మేకర్స్ రిలీజ్ చేశారు. బహుశా భారతీయ సినీ చరిత్రలో అలా చేయడం ఇదే తొలిసారి.
రీ రిలీజ్ కు కూడా ప్రీమియర్స్ వేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. భారీ వసూళ్లను సాధించింది బాహుబలి ఎపిక్. థియేటర్స్ కు ఆడియన్స్ ను పెద్ద ఎత్తున రప్పించింది. రూ.10 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టిన బాహబలి ఎపిక్ వెర్షన్.. ఇప్పటి వరకు రూ.37 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. తద్వారా ఇండియాలో టాప్-3 రీ రిలీజ్ గ్రాసర్ గా నిలిచింది. ఇండియా వైడ్ గా చూసుకుంటే రీ రిలీజ్ ట్రెండ్ లో ఇప్పటివరకు.. సనం తేరీ కసమ్ టాప్ ప్లేస్ లో ఉంది. ప్రేమకథా చిత్రంగా వచ్చిన ఆ సినిమా.. మొదటిసారి విడుదలైనప్పుడు పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. కానీ రీ రిలీజ్‌లో యూత్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంది. రూ.39.15 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మరి ఆ లిస్ట్ లో ఏ ఏ సినిమాలు ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం.
ఇండియాలో టాప్ రీ రిలీజ్ గ్రాసర్లు సనం తేరి కసం- 9.15 కోట్లు సాధించింది. అలీగే తుంబాడ్- 37.5 కోట్లు.. బాహుబలి ది ఎపిక్- 37 కోట్లు వసూళ్లు చేయగా.. ఇంటర్ స్టెల్లార్- 29 కోట్లు.. గిల్లి- 26.5 కోట్లు కొల్లగొట్టాయి. ఇక యే జవానీ హై దీవానీ- 25.4 కోట్లు టైటానిక్ 3డీ- 18 కోట్లు షోలే 3డీ- 13 కోట్లు లైలా మజ్ను- 11.6 కోట్లు రాక్ స్టార్- 11.5 కోట్లు అవతార్- 10 కోట్లు సాధించి రికార్డ్ స్థాయిలో నిలిచాయి. అయితే ఇప్పటి వరకు పై జాబితాలో సౌత్ నుంచి గిల్లి మూవీ మాత్రమే ఉంది. కానీ రీసెంట్ గా వచ్చిన బాహుబలి ది ఎపిక్ అందులో చేరి సత్తా చాటింది. మూడో స్థానాన్ని సంపాదించుకుని అలరించింది. టాలీవుడ్ నుంచి ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న తొలి మూవీగా కూడా బాహుబలి సినిమా నిలిచింది.