తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు స్పీకర్ మరో సారి నోటిసులు పంపించిండ్రు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషనఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం తమ అనుచరులతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందిలో వీళ్లు కూడా ఉన్నారు. మిగిలిన 8 మంది స్పీకర్ ఎదుట విచారణకు హాజరవుతుండగా, మాజీ మంత్రులు దానం, కడియం మాత్రం ఇప్పటివరకు స్పీకర్ నోటీసులకు స్పందించలేదు.
ఇక విషయంలోకి వెళ్తే…
తెలంగాణ పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ నేటితో ముగిసింది. కేసు విచారణ ఆలస్యంపై ఇప్పటికే సుప్రీంకోర్టు సీరియస్ అవడంతోపాటు నాలుగు వారాలు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణలో వేగం పెంచాలని అసెంబ్లీ స్పీకర్ నిర్ణయించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించి కాంగ్రెస్ పార్టీలో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 10మంది ఎమ్మెల్యేలపై విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది స్పీకర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. తమ అపిడవిట్లను దాఖలు చేశారు. అయితే, దానం నాగేందర్, కడియం శ్రీహరిలు విచారణకు హాజరుకాలేదు. స్పీకర్ నోటీసులకు స్పందించలేదు. ఇక వీరిద్దరూ కాంగ్రెస్లో చేరారనేందుకు బలమైన ఆధారాలు ఉండడం వల్లే విచారణకు హాజరు కావడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఈ వారంలో స్పీకర్ తీర్పు ఉండడంతో ఆలోపే రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లాలని ఇద్దరూ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అనుచరులతో సమావేశమై రాజీనామాపై వారి అభిప్రాయం తీసుకున్నట్లు సమాచారం.
2023 లో పార్టీ మారిన ఎమ్మెల్యేలు..!
అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం, కడియం బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో దానం నాగేందర్ 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. ఇక కడియం శ్రీహరి కూతురు కావ్య వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేయడంతో ఆమె తరఫున కడియం బహిరంగంగా ప్రచారం నిర్వహించారు.
దానం కు, కడియం కు నోటిసులు…
ఇక ఇప్పుడు స్పీకర్ పంపించన నోటిసులకు స్పందించి స్పీకర్ ముంగట హాజరైతే ఖచ్చితంగా వేటు పడుతుందని దానం, కడియంలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వేటుపడితే ఆరు సంవత్సరాల పాటు పోటీ చేయడానికి నో ఛాన్స్. ఈ క్రమంలో రాజీనామా చేసేందుకు వారు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలో దానం నాగేందర్ ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. రాజీనామా చేస్తే తన పరిస్థితి ఏమిటని పార్టీ పెద్దలతో దానం సంప్రదింపులు జరపనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కడియం శ్రీహరి, దానం నాగేందర్ లు ఇప్పటికే తమ అనుచరులతో బేటీ అయినట్లు తెలిసింది. రాజీనామా విషయమై చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో వీరిద్దరూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.