దేశవ్యాప్తంగా పాన్ ఇండియా చిత్రాల క్రేజ్ పెరుగుతున్నప్పటికీ స్టార్ హీరోల సినిమాలు పూర్తి కావడానికి రెండేళ్లు పైగానే పడుతుండటం అభిమానుల్లో కొత్త ఆందోళనను తీసుకొచ్చింది. పెద్ద సినిమాలు చూడటం ఆనందమే అయినా, తమ హీరోను స్క్రీన్‌పై తరచూ చూడలేకపోవడంపై అభిమానులు ఇటీవల బహిరంగంగానే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌లో స్టార్ హీరో అల్లు అర్జున్ జోష్ కొనసాగుతోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ వేగంగా ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ అనుకున్నదానికంటే త్వరగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో బన్నీ తదుపరి చిత్రం కోసం ముందుగానే ప్లానింగ్ మొదలు పెట్టారని ఇండస్ట్రీ టాక్. ఈ షూటింగ్ అనుకున్నదానికంటే ముందే పూర్తయ్యే ఛాన్స్ ఉండటంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరో ప్రాజెక్టును చేపట్టాలని అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నారట.

ఇప్పటికే బోయపాటితో చర్చలు జరిగాయని సమాచారం. వారిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సరైనోడు బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈసారి ఇంకా భారీ స్కేల్‌లో, ప్యాన్-ఇండియా రేంజ్‌లో మూవీ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం. అల్లు అరవింద్ సూచనతో ఈ కాంబోపై చర్చలు వేగం పుంజుకోగా 2026లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు. ఇక అల్లు అర్జున్ – అట్లీ దర్శకత్వంలో భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రం 2027 వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ తర్వాత బన్నీ ఏ సినిమా చేస్తారన్న ఆసక్తి టాలీవుడ్‌లో కొనసాగుతూనే ఉంది.