Seed Access Road: రాజధానికి మరో కీలక రహదారి.. సీడ్ యాక్సెస్ రోడ్ ప్రత్యేకత ఇదే!
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. రాజధాని ప్రాంతానికి అత్యంత కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డును సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. దీంతో అమరావతికి రవాణా కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. రాజధాని అభివృద్ధిలో ఈ రహదారి ఎలాంటి పాత్ర పోషించనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏపీ రాజధాని అమరావతిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని అమరావతిని ప్రకాశం బ్యారేజీ – ఉండవల్లి కూడలి మధ్య పాత జాతీయ రహదారికి అనుసంధానంచేస్తూ నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డును, బుకింగ్ హామ్ కెనాల్‌పై స్టీల్ బ్రిడ్జి, కొండవీటి వాగుపై స్టీల్ బ్రిడ్జిని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో గ్రిడ్ పద్ధతిలో నిర్మిస్తున్న అమరావతి రోడ్డు నెట్వర్క్ అభివృద్ధిలో ఈ ప్రాజెక్ట్ ఒక కీలక ముందడుగుగా నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో సీడ్ యాక్సిస్ రోడ్ అంటే ఏమిటి..? దీని వల్ల లాభాలేమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని ప్రాంతాన్ని విజయవాడ, మంగళగిరి, జాతీయ రహదారితో అనుసంధానించే సీడ్ యాక్సెస్ రోడ్డులో కీలక భాగాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. బకింగ్‌హామ్ కెనాల్, కొండవీటి వాగుపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను కూడా ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్న అమరావతి రోడ్డు నెట్‌వర్క్‌లో ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది.
సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏంటి?
అమరావతి రాజధాని ప్రాంతాన్ని విజయవాడ–మంగళగిరి రహదారి, జాతీయ రహదారి-16తో అనుసంధానించే ప్రధాన మార్గమే సీడ్ యాక్సెస్ రోడ్. రాజధాని ప్రాంతంలో రాకపోకలు సులభంగా సాగడంతో పాటు భవిష్యత్‌లో పెరిగే ట్రాఫిక్‌ను తట్టుకునేలా ఈ రహదారిని భారీ కారిడార్‌గా అభివృద్ధి చేస్తున్నారు.
ఈ రహదారి దొండపాడు నుంచి ప్రారంభమై రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి ప్రాంతాల మీదుగా మణిపాల్ ఆస్పత్రి సమీపంలోని ఎన్‌హెచ్-16కు అనుసంధానం కానుంది.
మూడు దశల్లో నిర్మాణం
మొత్తం 21.77 కిలోమీటర్ల పొడవుతో సీడ్ యాక్సెస్ రోడ్డును మూడు దశల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో మొదటి దశలో 14.35 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తై ఇప్పటికే రాకపోకలకు అందుబాటులో ఉంది. రెండో దశలో 3.92 కిలోమీటర్ల రహదారి నిర్మించారు. మూడో దశలో ఉండవల్లి నుంచి మణిపాల్ ఆస్పత్రి వరకు 3.50 కిలోమీటర్ల రహదారి పనులు కొనసాగుతున్నాయి.
ఈ కారిడార్‌ను 60 మీటర్ల వెడల్పుతో అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో తొమ్మిది లేన్ల రహదారితో పాటు బీఆర్టీఎస్ కారిడార్, సర్వీస్ రోడ్లకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రహదారితో పాటు డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, గ్యాస్ వంటి మౌలిక సదుపాయాల పనులను కూడా చేపడుతున్నారు.
రూ.1,519 కోట్లతో నిర్మాణం
సీడ్ యాక్సెస్ రోడ్ కోసం మొత్తం 320.54 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 278.93 ఎకరాల భూసేకరణ ఇప్పటికే పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సుమారు రూ.1,519 కోట్లను ఖర్చు చేస్తున్నారు.
స్టీల్ బ్రిడ్జిలతో మరింత మెరుగైన కనెక్టివిటీ
సీడ్ యాక్సెస్ రోడ్డులో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బకింగ్‌హామ్ కెనాల్‌పై 478 మీటర్ల పొడవుతో నాలుగు వరుసల స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ వంతెన ద్వారా విజయవాడ వైపు నుంచి నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డులోకి ప్రవేశించి అమరావతికి చేరుకోవచ్చు.
అలాగే కొండవీటి వాగుపై 284 మీటర్ల పొడవుతో మరో స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. వర్షాకాలంలో నీటి ప్రవాహం, వరద పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ వంతెనను నిర్మించడం ద్వారా రాజధాని ప్రాంతానికి మెరుగైన రాకపోకల సౌకర్యం కలగనుంది.
పర్యాటక ప్రాంతంగానూ అభివృద్ధి
సీడ్ యాక్సెస్ రోడ్డును కేవలం రవాణా మార్గంగా కాకుండా పర్యాటక ఆకర్షణగా కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కృష్ణానది, కొండవీటి వాగు పరిసరాలను వీక్షించేలా వ్యూ పాయింట్లను ఏర్పాటు చేయడంతో పాటు సైక్లింగ్, వాకింగ్ ట్రాక్‌లు, ల్యాండ్‌స్కేపింగ్, గార్డెన్లను అభివృద్ధి చేయనున్నారు.
మొత్తంగా సీడ్ యాక్సెస్ రోడ్ అమరావతికి కీలకమైన కనెక్టివిటీని అందించడమే కాకుండా రాజధాని ప్రాంత అభివృద్ధికి మరింత ఊతమివ్వనుంది. భవిష్యత్‌లో అమరావతి విస్తరించే కొద్దీ ఈ రహదారి ప్రధాన రవాణా మార్గంగా మారే అవకాశం ఉంది.