Loan Apps:డిజిటల్ యాప్‌లో లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తెలుసా..? ఈ ఆరు యాప్స్‌పై కేంద్రం కొరడా.. గూగుల్‌కు కీలక ఆదేశాలు

లోన్ యాప్స్‌ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పలు డిజిటల్ లోన్ యాప్స్‌పై చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా అనుమతి లేని, నిబంధనలు పాటించని కొన్ని లోన్ యాప్స్‌ను నిషేధించింది. అలాగే వాటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించేలా చర్యలు చేపట్టింది.

బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలంటే క్రెడిట్ హిస్టరీ, ఆదాయం, రుణ చెల్లింపు సామర్థ్యం వంటి అంశాలను బ్యాంకులు పరిశీలిస్తాయి. మంచి సిబిల్ స్కోర్ ఉంటే లోన్ పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అయితే స్కోర్ తక్కువగా ఉండటంతో బ్యాంకు రుణం లభించకపోతే కొందరు డిజిటల్ లోన్ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు.

అయితే కొన్ని అనధికార లోన్ యాప్స్ అధిక వడ్డీలు, భారీ ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేయడంతో పాటు రుణం చెల్లింపులో ఆలస్యం జరిగితే వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని యాప్స్ లోన్ ఇచ్చే సమయంలో ఒక వడ్డీ రేటును చూపించి, ఆ తర్వాత అధిక వడ్డీ వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి.

ఇలాంటి అక్రమ డిజిటల్ లోన్ యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా ఆరు లోన్ యాప్స్‌పై కేంద్రం కొరడా ఝుళిపించింది.

ఆరు యాప్స్‌పై చర్యలు

నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించిన ఆరు డిజిటల్ లోన్ యాప్స్‌కు సంబంధించిన యాక్సెస్‌ను తొలగించాలని హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ గూగుల్‌ను ఆదేశించింది.

ఈ జాబితాలో లోన్‌ఆర్బిట్, హిసాబ్, నెక్సస్ లోన్, వన్ ఫండ్, క్రెడిట్ ఫ్యాక్టర్, మొబైల్ క్రెడిట్ ప్రైరీ యాప్స్ ఉన్నట్లు పేర్కొంది. అత్యవసరంగా రుణం అవసరమైన వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ యాప్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు తెలిపింది.

ఈ యాప్స్‌కు సంబంధించిన URLలను తొలగించడం లేదా వాటి యాక్సెస్‌ను నిలిపివేయాలని గూగుల్‌కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. నోటీసులు జారీ చేసిన మూడు గంటల్లోపు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొంది.

తక్కువ వడ్డీ అంటూ.. ఆ తర్వాత అధిక ఛార్జీలు

ఈ లోన్ యాప్స్‌లో రుణం తీసుకునే సమయంలో తక్కువ వడ్డీ రేట్లను చూపించి వినియోగదారులను ఆకర్షిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. అయితే రుణం మంజూరైన తర్వాత అసలు మొత్తంపై అధిక వడ్డీ రేట్లు విధిస్తున్నట్లు తెలిపింది.

అంతేకాకుండా వినియోగదారుల నుంచి ఆధార్ వంటి గుర్తింపు వివరాలు, ఆర్థిక సమాచారం, కాంటాక్ట్స్, గ్యాలరీ, కెమెరా వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు గుర్తించినట్లు పేర్కొంది.

లోన్ యాప్‌ వాడే ముందు జాగ్రత్త

డిజిటల్ లోన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు అది అధికారికంగా అనుమతించబడిన సంస్థకు చెందినదేనా? యాప్ ఏయే అనుమతులు అడుగుతోంది? వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజులు ఎంత? వంటి వివరాలను తప్పకుండా పరిశీలించాలి.

తెలియని యాప్స్‌కు వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారం, కాంటాక్ట్స్, ఫొటోలు వంటి సున్నితమైన డేటాను ఇవ్వకుండా జాగ్రత్త వహించడం మంచిది. అత్యవసరంగా రుణం అవసరమైనప్పుడు గుర్తింపు ఉన్న బ్యాంకులు, NBFCలు లేదా అధికారిక డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే ఆశ్రయించడం సురక్షితం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *