విజయసాయిరెడ్డి పొలిటికల్ రీఎంట్రీ.. కొత్త పార్టీపై సంచలన ప్రచారం!
Vijayasai Reddy Political Re Entry: రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయిరెడ్డి మళ్లీ పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తున్నారా? ఆయన తాజా వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన విజయసాయిరెడ్డి.. ఇకపై వ్యవసాయమే తన వ్యాపకమని గతంలో స్పష్టం చేశారు. అయితే కొంతకాలంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారనే చర్చ మొదలైంది.
మళ్లీ పాలిటిక్స్‌పై ఆసక్తి?
ఒక దశలో సొంత మీడియా సంస్థ ఏర్పాటు చేస్తారనే ప్రచారం విజయసాయిరెడ్డి చుట్టూ సాగింది. ఇప్పుడు మాత్రం ఆయన దృష్టి మళ్లీ రాజకీయాల వైపు మళ్లిందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు? లేక సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
గత కొంతకాలంగా విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారం ఒకవైపు, తిరిగి వైఎస్సార్సీపీలోకి వెళ్తారనే చర్చ మరోవైపు సాగుతోంది. ముఖ్యంగా ఆయన వైఎస్సార్సీపీలోకి తిరిగి వెళ్లబోతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ప్రచారంపై విజయసాయిరెడ్డి క్లారిటీ
తిరిగి వైఎస్సార్సీపీలో చేరబోతున్నారనే ప్రచారంపై విజయసాయిరెడ్డి స్పందించారు. తన రాజకీయ పునరాగమనం, భవిష్యత్ ప్రణాళికలు, కార్యాచరణ, వ్యూహాలను త్వరలో మీడియా మిత్రులతో నిర్వహించే ప్రెస్మీట్లో ప్రకటిస్తానని తెలిపారు.
తాను స్వతంత్ర మనస్తత్వం కలిగిన వ్యక్తినని, ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు, ప్రభావాలకు లొంగకుండా నిర్ణయాలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని, ఆత్మగౌరవంతో, నిర్భయంగా తన నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు.
విజయసాయిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన రాజకీయ రీఎంట్రీపై జరుగుతున్న చర్చకు మరింత ఊతమిచ్చాయి.
‘భారత్ జన వికాస్’ పేరుతో కొత్త పార్టీ?
ఇదిలా ఉంటే.. విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారనే ప్రచారం కూడా జోరందుకుంది. ఆయన పెట్టబోయే పార్టీకి ‘భారత్ జన వికాస్’ అనే పేరు ఖరారు చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ పేరుపై విజయసాయిరెడ్డి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ‘భారత్ జన వికాస్’ పేరుతో పార్టీ ఏర్పాటు చేస్తారన్నది కేవలం ప్రచారమేనా? లేక నిజంగానే కొత్త పార్టీకి శ్రీకారం చుడతారా? అనేది ఆసక్తికరంగా మారింది.
అసలు విజయసాయిరెడ్డి ప్లాన్ ఏంటి?
విజయసాయిరెడ్డి తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండే ఆలోచనలో లేరనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఆయన ఏ పార్టీలో చేరతారు? సొంత పార్టీ పెడతారా? లేక రాజకీయాలకు సంబంధించి మరో కొత్త వ్యూహంతో ముందుకు వస్తారా? అనేది మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.
త్వరలో నిర్వహించనున్న ప్రెస్మీట్లో తన రాజకీయ భవిష్యత్తుపై విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో ఆయన రాజకీయ రీఎంట్రీపై ఉత్కంఠ నెలకొంది.