ఏపీ రాజకీయాలు మొత్తం ఒకరి చుట్టూ తిరుగుతున్నాయి.. వచ్చే ఎన్నికల్లో వారిద్దరి మధ్యే పోరు: జనసేన ఎంపీ

Janasena Party Mp Balashowry On AP Politics And 2029 Elections: ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిణామాలపై జనసేన పార్టీ ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పందించారు. కొద్దిరోజులుగా గమనిస్తే.. ఏపీ రాజకీయాలు మొత్తం పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయన్నారు. ఆయన్ను టార్గెట్ చేస్తూ కొందరు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని.. ఇలాంటివి పవన్ కళ్యాణ్‌ను బలహీనపరచలేవంటూ జనసేన పార్టీ ఎంపీ బాలశౌరి ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రశ్న రావణ్‌పై కేసులు, అరెస్ట్ ఎపిసోడ్ గురించి చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు, రావణ్ గతంలో చేసిన వీడియోల అంశం తెరపైకి వచ్చింది. అలాగే రావణ్‌పై ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడంపై పెద్ద డిబేట్ నడుస్తోంది. రావణ్‌పై ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడం సరికాదని విపక్షాలు అంటుంటే.. రావణ్ చేసిన వ్యాఖ్యలు కరెక్టేనా, వాటిని సమర్థిస్తున్నారా అంటూ అధికారపక్షం కౌంటరిస్తోంది. తాజాగా ఈ పరిమాణాలపై జనసేన పార్టీ ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పందించారు.

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోందని.. రాజకీయ చర్చలు క్రమంగా ఒక వ్యక్తి చుట్టూనే కేంద్రీకృతమవుతున్నాయని.. ఆయనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకవైపు ఆయన నాయకత్వం, సనాతన భారతీయ విలువల పరిరక్షణ, జాతీయ దృక్పథం, అవినీతి నిర్మూలన, సుపరిపాలన, కూటమి రాజకీయాల్లో సమన్వయం, రాష్ట్ర అభివృద్ధిపై ఆయన చూపిస్తున్న నిబద్ధత ప్రజల్లో చర్చకు వస్తోందన్నారు. జవాబుదారీతనం, అభివృద్ధి, దీర్ఘకాలిక సంస్కరణలపై దృష్టి సారించిన కొత్త తరహా నాయకత్వానికి పవన్ కళ్యాణ్ ప్రతినిధిగా నిలబడుతున్నారు అనేది అందరికి స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

ప్రతిపక్షం దానిని నిర్వీర్యం చేయడానికి ఏకధాటిగా ఆయన వ్యక్తిత్వంపై బురదజల్లుతూ సోషల్ మీడియా ద్వారా నిత్యం విషం చిమ్ముతుందన్నారు బాలశౌరి. ప్రశ్న జోసెఫ్‌ను అడ్డుపెట్టుకుని పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత దూషణలు, అసభ్య ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయన్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లుగా, అసత్య ప్రచారం వెనుక ఉన్న వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తు్న్నాయన్నారు. మరోవైపు సుగాలి ప్రీతి తల్లి తనకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్‌పై కేసు వేయడంతో సమాజం అసహ్యించుకుంటుందని ఘాటుగా స్పందించారు.


ఇలాంటి విమర్శలు, దుష్ప్రచారాలు ఆయనను బలహీనపరచడం లేదని.. మహాశిల్పాన్ని తీర్చిదిద్దే ఉలి దెబ్బల్లా, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని మరింత దృఢంగా, ప్రజల విశ్వాసానికి మరింత చేరువ చేస్తున్నాయన్నారు. దేశాన్ని ప్రేమించే నాయకులను విమర్శించడం సులభం.. కానీ వారి ఆలోచనల స్థాయిని అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదన్నారు. పవన్ కళ్యాణ్ కేవలం ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు కాదు.. దేశ ప్రయోజనాలను రాజకీయాలకు మించి భావించే జాతీయవాదన్నారు. అందుకే నేడు ఆయన ప్రతి మాట, ప్రతి నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోందన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *