మొసలిని పెళ్లాడిన మేయర్.. తెల్లటి గౌను వేసి ఘనంగా వివాహం.. డ్యాన్సులు, ముద్దులు.. ఓరీ దేవుడో ఇదెక్కడి విడ్డూరం అంటున్న నెటిజన్స్‌

వార్నీ ఇదెక్కడి విడ్డూరం.. ఎవరైనా మొసలిని పెళ్లి చేసుకోవడం గురించి మీరు ఎప్పుడైనా వీన్నారా? కానీ, మెక్సికోలో జరిగిన ఒక వింత వివాహం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మెక్సికోలోని ఓక్సాకా ప్రావిన్స్‌లో ఉన్న శాన్ పెడ్రో హువామెలులా అనే చిన్న పట్టణం ఈ విచిత్ర ఘటనతో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. అక్కడి మేయర్ విక్టర్ అగ్యిలార్ అందరినీ ఆశ్చర్యపరిచే ఒక వధువును ఎంచుకున్నారు. ఈ వధువు ఒక సాధారణ మనిషి కాదు, పెళ్లి దుస్తులు ధరించి మేయర్‌తో వివాహ బంధంలోకి ప్రవేశించిన ఒక ఆడ మొసలి. పెళ్లి మండపంలో ఆ మొసలికి తెల్లటి గౌను తొడిగారు. మేయర్ విక్టర్ తన వింత వధువును లాంఛనాలతో పెళ్లి చేసుకుని ప్రేమతో ముద్దుపెట్టుకుని, కౌగిలించుకున్నారు. అయితే, ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు ఆస్కారం లేకుండా, భద్రతా కారణాల దృష్ట్యా మొసలి దవడలను గట్టిగా కట్టేశారు. కానీ, ఎందుకు ఇలా చేశారో తెలుసా…

పురాతన సంస్కృతి – ఆచారం:
మెక్సికోలోని ఓక్సాకా రాష్ట్రంలో ఉన్న సాన్ పెడ్రో హువమెలులా అనే తీరప్రాంత నగర మేయర్ విక్టర్ అగ్యులర్ ఈ వింత వివాహం చేసుకున్నారు. స్థానిక చోంటల్, హువే అనే రెండు గిరిజన వర్గాల మధ్య ఉన్న శతాబ్దాల నాటి పురాతన సాంప్రదాయం ప్రకారం ఈ వేడుక జరిగింది. ఈ ఆచారం ప్రకారం, ఒక ఆడ మొసలిని ప్రకృతి మాతకు ప్రతిరూపమైన రాకుమారి లేదా దేవతగా భావిస్తారు. స్థానిక పాలకుడు ఆ మొసలిని పెళ్లాడటం ద్వారా ప్రకృతి శక్తులతో సత్సంబంధాలు ఏర్పడతాయని వారి నమ్మకం.
పెళ్లికూతురిగా ముస్తాబైన మొసలి:
ఈ పెళ్లి కోసం ఆ చిన్న మొసలిని ఒక నిజమైన పెళ్లికూతురిలా ముస్తాబు చేశారు. దానికి తెల్లటి లగ్జరీ గౌను వేసి, తలపై ముసుగు కూడా ధరింపజేశారు. అయితే, పెళ్లి వేడుకలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా, ఆ మొసలి ఎవరినీ కరవకుండా ఉండేందుకు దాని నోటిని తాడుతో గట్టిగా కట్టేశారు. మేయర్ విక్టర్ అగ్యులర్ ఆ మొసలిని చేతుల్లోకి తీసుకుని స్థానిక ప్రజల డ్యాన్సులు, డప్పు వాయిద్యాల మధ్య నగర వీధుల్లో ఊరేగించారు. వేడుక ముగింపులో ఆయన ఆ మొసలి తలపై ముద్దు పెట్టి వివాహాన్ని పూర్తి చేశారు.

ఇదంతా సమృద్ధి, శ్రేయస్సు కోసమే అంటున్న జనాలు..
ఈ వింత ఆచారం వెనుక ఒక బలమైన నమ్మకం ఉంది. ఈ పెళ్లి చేయడం వల్ల తమ నగరానికి సుఖసంతోషాలు, సంపద కలుగుతాయని స్థానికులు నమ్ముతారు. ముఖ్యంగా తీరప్రాంతం కావడంతో సముద్రంలో జాలరులకు చేపల వేట బాగా దొరుకుతుందని, భూమిపై పంటలు బాగా పండుతాయని, కరువు కాటకాలు రావని విశ్వసిస్తారు. ఆధునిక కాలంలో కూడా తమ పూర్వీకుల సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్న మెక్సికో ప్రజల ఈ వింత పెళ్లి వేడుక ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *