Budget for 2026-27 : తెలంగాణ అసెంబ్లీలో 2026-27ను బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Budget 2026-27 : తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు. రూ. 3,24,234 కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా… ఈ సారి ఆ మొత్తం మరింతగా పెరిగింది. ఇక, తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు భట్టి విక్రమార్క ప్రజాభవన్ లో నల్ల పోచమ్మ ఆలయం వద్ద బడ్జెట్ ప్రతులను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి బయలుదేరారు. అసెంబ్లీ కమిటీ హాలులో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ 2026-27కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇక ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. బడ్జెట్లో రెవెన్యూ వ్యయం.. రూ.2,34,406 కోట్లు, మూలధన వ్యయం.. రూ.47,267 కోట్లుగా ప్రతిపాదించారు. ప్రధాన శాఖల వారీగా కేటాయింపులు బడ్జెట్‌లో ప్రతి రంగానికి సముచిత స్థానం కల్పిస్తూ నిధుల పంపిణీ జరిగింది. ముఖ్యంగా గ్రామ సీమల అభివృద్ధి కోసం పంచాయతీ రాజ్ శాఖకు సింహభాగం నిధులు దక్కాయి.
ప్రజా సంక్షేమమే ధ్యేయం..
తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో నాలుగోసారి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అదే సమయంలో శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పద్దును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శవంతమైన పాలన అందిస్తోందని పేర్కొన్నారు. గడిచిన రెండేళ్లలో అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేశామని, తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలపడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా రైతు సంక్షేమం, మహిళా సాధికారిత, యువతకు ఉపాధి కల్పనతో పాటు రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేసినట్లు ఆయన వివరించారు. ఇక ఒక్కోక్క శాఖ వారిగా ఏ శాఖకు ఎంత బడ్జెట్ వచ్చిందో ఒక సారి చూద్దాం రండి.
శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు..
- పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి: రూ. 33,688 కోట్లు
- విద్య: రూ. 26,674 కోట్లు
- వ్యవసాయం: రూ. 23,179 కోట్లు
- సాగునీటి రంగం (Irrigation): రూ. 22,615 కోట్లు
- విద్యుత్ శాఖ (Energy): రూ. 21,285 కోట్లు
- మున్సిపల్ పరిపాలన: రూ. 17,907 కోట్లు
- వైద్యం & ఆరోగ్యం: రూ. 13,679 కోట్లు
- రవాణా, రహదారులు & భవనాలు: రూ. 12,789 కోట్లు
- బీసీ సంక్షేమం: రూ. 12,511 కోట్లు
- హోం శాఖ: రూ. 11,907 కోట్లు
- ఎస్సీ సంక్షేమం: రూ. 11,784 కోట్లు
- ఎస్టీ సంక్షేమం: రూ. 7,937 కోట్లు
- గృహ నిర్మాణం (Housing): రూ. 7,430 కోట్లు
- పౌర సరఫరాలు: రూ. 7,366 కోట్లు
- మైనారిటీల సంక్షేమం: రూ. 3,769 కోట్లు
- పరిశ్రమలు: రూ. 3,490 కోట్లు
- మహిళా & శిశు సంక్షేమం: రూ. 3,143 కోట్లు
- పశుసంవర్ధక & మత్స్య శాఖ: రూ. 1,529 కోట్లు
- పర్యాటక రంగం: రూ. 1,224 కోట్లు
- కార్మిక సంక్షేమం: రూ. 998 కోట్లు
- ఐటీ (IT) శాఖ: రూ. 875
- చేనేత రంగం: రూ. 258 కోట్లు
