స్వదేశీ డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ భీమ్ (BHIM) పేమెంట్స్ యాప్.. యూజర్లకు అద్భుత ఆఫర్ ప్రకటించింది. 10వ ఏట అడుగు పెట్టిందీ యాప్. దశమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకున్న సందర్భంగా గర్వ్ సే స్వదేశీ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించే చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో వినియోగదారులకు ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
భీమ్ యూపీఐ యాప్..

తొలిసారిగా భీమ్ యూపీఐ యాప్ ను ఉపయోగించే వారికి 20 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ యాప్ లో లాగిన్ అయిన తర్వాత తొలిసారిగా 20 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో కూడిన లావాదేవీలను నిర్వహించిన వారికి ఫ్లాట్ 20 రూపాయల క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. ఇది- గ్రామీణ స్థాయిలో డిజిటల్ చెల్లింపులు, స్వీకరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ భావిస్తోంది.

BHIM డిజిటల్ చెల్లింపులు..
NPCI BHIM సర్వీసెస్ లిమిటెడ్ (NBSL) వేసిన అంచనాల ప్రకారం.. కిరాణా షాపులు, బస్సు/మెట్రో రైలు టిక్కెట్లు, ప్రీపెయిడ్ మొబైల్/డిష్ రీఛార్జీలు, గృహావసరాలకు సంబంధించి అన్ని రకాల బిల్లుల చెల్లింపులు అంటే ఎలక్ట్రిసిటీ/వాటర్ బిల్లులు చెల్లించిన వినియోగదారులకు నెలకు 300 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా BHIM డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించాలని నిర్ణయించామని, ఇందులో భాగంగానే ‘గర్వ్ సే స్వదేశీ’ క్యాంపెయిన్ చేపట్టామని ఎన్బీఎస్ఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లలిత నటరాజ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు డిజిటల్ చెల్లింపులు చేయని వారిని భీమ్ పరిధిలోకి తీసుకుని రావడం రోజువారీ అవసరాలకు అనుగుణంగా అలవాటు చేయడంపై దృష్టి సారించామని లలిత నటరాజ్ తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో అప్ డేట్ అయిన భీమ్ యాప్.. 15కు పైగా ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉందని, యాడ్స్ ఫ్రీ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉండటం దీని ప్రత్యేకతగా వివరించారు. లో- నెట్ వర్క్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలకూ ఆప్టిమైజ్ చేసినట్లు చెప్పారు.