వైసీపీ అధినేత జగన్ సుమారు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సీబీఐ కోర్టు మెట్లెక్కారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందిన జగన్, ఎన్నికల అనంతరం కూడా అదే మినహాయింపును కొనసాగించాలని కోర్టును కోరారు. అయితే, ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించి, విచారణకు తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.
ఇక విషయంలోకి వెళ్తే…
అక్రమ ఆస్తుల కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరేళ్ల తర్వాత కోర్టు మెట్లు ఎక్కారు. ఏపీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి స్పెషల్ ఫ్లైట్‌లో వచ్చిన జగన్.. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో నాంపల్లి ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. అభిమానులు ఆయనను చూసేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు కోర్టు ప్రాంగణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ జగన్ కోర్టులోకి అడుగుపెట్టారు. చివరి సారిగా 2020 జనవరిలో సీఎం హోదాలో జగన్ నాంపల్లి కోర్టుకు వచ్చారు. ఇంతకాలం సీఎంగా బిజీ ఉన్నానంటూ.. వ్యక్తిగతంగా హాజరుకావడానికి మినహాయింపు కోరారు జగన్. ఐతే అధికారం కోల్పోయిన తర్వాత కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడంతో.. దీనికి ఏసీబీ కోర్టు అనుమతించలేదు. చివరికి నేడు ఏసీబీ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకాలేక తప్పలేదు.
సీబీఐ లో 11 ఛార్జ్ షీట్లు..
ఈ నేపథ్యంలోనే, జగన్ ఈరోజు న్యాయమూర్తి రఘురామ్ ముందు విచారణకు హాజరయ్యారు. జగన్ రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కోర్టు ప్రాంగణంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ మొత్తం 11 ఛార్జ్‌షీట్లు దాఖలు చేసింది. ఈ కేసుల్లో తమను తొలగించాలని కోరుతూ దాఖలైన సుమారు 130 డిశ్చార్జ్ పిటిషన్లు ఇంకా కోర్టులో పెండింగ్‌లోనే ఉన్నాయి.
సాధారణ పౌరుడుగా జగన్ విచారణ..
గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అధికారిక కార్యక్రమాల కారణంగా జగన్ కోర్టుకు హాజరుకాలేకపోయారు. అయితే, ఇప్పుడు ఆయన సాధారణ పౌరుడిగా, సాధారణ ఎమ్మెల్యేగా విచారణను ఎదుర్కోవాల్సి వస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన క్రమం తప్పకుండా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.
అసలేంటీ ఈ కేసు…?
జగన్‌మోహన్ రెడ్డి ఆస్తుల కేసు 2011లో సీబీఐ దర్యాప్తుతో చేపట్టింది. జగన్‌తో కలిసి దాల్మియా సిమెంట్స్ అక్రమంగా సున్నపురాయి గనుల లీజులు పొందినట్లు సీబీఐ 2013లో చార్జీషీటు దాఖలు చేసింది. తద్వారా జగన్ సుమారు 150కోట్ల మేర అక్రమంగా లబ్ధి పొందినట్లు పేర్కొంది. రఘురామ్ సిమెంట్స్‌లో 95కోట్ల విలువైన షేర్లు, 55కోట్లు హవాలా రూపంలో దాల్మియా సిమెంట్స్ ఇచ్చినట్లు అభియోగం మోపింది. ఈ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు దాల్మియా ఉద్యోగి జయదీప్ బసు నుంచి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్‌లో లభించినట్లు పేర్కొంది. అరబిందో, హెటిరో సంస్థలకు క్విడ్ ప్రొకో కింద మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో భూముల కేటాయింపుపై 2016లో ఈడీ కేసు నమోదు చేసింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లలో దాల్మియా సిమెంట్స్ , ఇండియా సిమెంట్స్ , రఘురాం సిమెంట్స్, పెన్నా సిమెంట్స్ వంటి సంస్థలపై నిర్దిష్ట ఆరోపణలు ఉన్నాయి. దాల్మియా సిమెంట్స్ 95 కోట్ల పెట్టుబడి పెట్టి తద్వారా జగన్ సంస్థలకు 55 కోట్లు హవాలా మార్గంలో చేర్చినట్లు సీబీఐ ఆరోపించింది. సీబీఐ చార్జ్‌షీటు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. దాల్మియా సిమెంట్స్‌కు చెందిన 793 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇందులో 377కోట్ల 26లక్షల విలువైన భూములు కూడా ఉన్నాయి. ఈడీ చర్యను సవాల్ చేస్తూ దాల్మియా సంస్థ అడ్జుకేటింగ్ అథారిటీని ఆశ్రయించింది. కేసును లోతుగా పరిశీలించిన అథారిటీ, ఈడీ వాదనలతో ఏకీభవిస్తూ జప్తును ఖరారు చేస్తూ తుది నిర్ణయం ప్రకటించింది.
వైఎస్ హయాంలో కేసు విచారణ స్టార్ట్..
ఇక వాన్‌పిక్ ప్రాజెక్టు కేసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలోనే ప్రారంభమైంది. ఇందులో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గల్ఫ్ దేశాలకు చెందిన రాస్ అల్ ఖైమా ప్రభుత్వంతో కలిసి ఈ ప్రాజెక్టును మొదలుపెట్టాయి. ఈ ప్రాజెక్టుకు ఛైర్మన్‌గా నిమ్మగడ్డ ప్రసాద్‌ను నియమించారు. ఈ వాన్‌పిక్ ప్రాజెక్టు కోసం నిబంధనలను ఉల్లంఘించి సుమారు 15 వేల ఎకరాలకు పైగా అక్రమంగా భూములు కేటాయించారని.. దానికి ప్రతిఫలంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన కంపెనీల్లో నిమ్మగడ్డ ప్రసాద్ భారీగా పెట్టుబడులు పెట్టారని సీబీఐ అధికారులు ఆరోపించారు. జగన్ ఆస్తుల కేసు రాజకీయంగా సున్నితమైన అంశంగా మారింది. వైసీపీ అనుకూల మీడియా ఈ కేసులను కక్షసాధింపుగా అభివర్ణిస్తుంది. అయితే టీడీపీ నాయకులు జగన్‌పై ఉచ్చు బిగుస్తోందని చెప్తున్నారు. ఈ కేసు దీర్ఘకాలంగా సాగుతోంది. విచారణలు, వాయిదాలు, రాజకీయ ఒత్తిళ్లతో సంక్లిష్టంగా మారింది.