హాసీనా ఎక్కడ దాకున్నారు..?

భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh) లో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. గతేడాది బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్ల సమయంలో మానవాళిపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనా (Former Prime Minister Sheikh Hasina) ను బంగ్లాదేశ్ ఐసీటీ (ICT) (ఇంటర్నేషన్ క్రైమ్స్ ట్రిబ్యునల్) (International Crimes Tribunal) సోమవారం దోషిగా తేల్చింది. బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనలకు ప్రధాన సూత్రధారి షేక్ హసీనానే అని పేర్కొంది. అప్పట్లో ఈ అల్లర్లల్లో 1,400 మందికి పైగా మరణించారు. వారందరి మరణానికీ షేక్ హసీనా బాధ్యురాలని తేల్చి చెప్పింది. ఆ అల్లర్లు తగ్గించేందుకు అవసరమైతే హెలికాప్టర్లను ఉపయోగించాలని భద్రతా బలగాలకు షేక్ హసీనా సూచించారు. అంతేకాదు.. తనకు వ్యతిరేకంగా ఉన్న ముఖ్య 226 మందిని చంపాలంటూ తన అనుచరుడు షకీల్‌ను హసీనా ఆదేశించారు’ అని విచారణ సందర్భంగా న్యాయమూర్తులు పేర్కొన్నారు. అషులియా, చంఖర్పుల్లలో ఆరుగురు సహా అనేక చోట్ల నిరసనకారులను పోలీసులు కాల్చి చంపారని ఐసీటీలోని ముగ్గురు న్యాయమూర్తులలో ఒకరు తెలిపారు. ఈ హత్యలకు షేక్ హసీనా ప్రధాన సూత్రధారి అని వ్యాఖ్యానించారు. ఇదే కాకుండా.. హసీనా విద్వేషపూరిత ప్రసంగాలతో విద్యార్థులను రెచ్చగొట్టారని కోర్టు పేర్కొంది.
మాజీ ప్రధానికి, హోంమంత్రికి ఉరిశిక్ష ఖరారు..!

ఈ మేరకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో మాజీ హోంమంత్రి (Former Home Minister) అసదుజ్జమాన్ ఖాన్ (Asaduzzaman Khan) కు సైతం కోర్టు మరణశిక్ష (death penalty) విధించింది. నేపథ్యంలో దేశ వ్యాప్తంగా దాడులు చోటు చేసుకుంటోన్నాయి. హసీనాకు చెందిన అవామీ లీగ్ దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. అవామీ లీగ్ (Awami League), ఆ పార్టీ కార్యకలాపాలను యునుస్ ప్రభుత్వం (Yunus government) నిషేధించినప్పటికీ.. ఈ బంద్‌కు పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన ఈ నేరాలకు ఇద్దరూ ప్రధాన సూత్రధారులుగా తేల్చింది. ఇదే నేరంతో ప్రమేయం ఉన్న మాజీ పోలీసు జనరల్ ఇన్స్పెక్టర్ చౌదరి అబ్దుల్లా అల్ మామున్ (Chaudhry Abdullah Al Mamun) కు అయిదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది.
బంగ్లాదేశ్ లో సైనిక తిరుగుబాటు..

మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్ (India) లోనే తలదాచుకుంటోన్నారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చెలరేగడం, ఆ తర్వాత ఉద్వాసనకు గురైన వెంటనే ఆమె భారత్ కు వచ్చారు. 2024 ఆగస్టు 5వ తేదీన అక్కడి సైనిక తిరుగుబాటు (A military coup), ఉద్యమకారులను తప్పించుకుని సరిహద్దులను దాటారు. భారత్ లో అడుగు పెట్టారు. ఆమెకు భారత్ ఆశ్రయం ఇచ్చింది. అప్పటి నుండి ఆమె ఢిల్లీలో ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తోన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు పూర్తి రక్షణ కల్పించింది. తన తల్లికి మరణ శిక్ష పడటం పట్ల షేక్ హసీనా కుమారుడు, మాజీ ప్రభుత్వ సలహాదారు సజీబ్ వాజెద్ స్పందించారు. ఢాకాలో మాట్లాడారు. ఆమె ప్రస్తుతం భారత్ లో భద్రతా దళాల రక్షణలో సురక్షితంగా ఉన్నారని అన్నారు. అవామీ లీగ్‌కు ఇకపై గట్టి మద్దతు లభిస్తుందని, తీర్పుకు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగుతాయని హెచ్చరించారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు అనిశ్చితిని సృష్టించడం ద్వారా పార్టీ ఎన్నికల నుండి నిషేధానికి గురైందని గుర్తు చేశారు.
మరణ శిక్షపై షేక్ హసీనా స్పందన..

తనకు మరణ శిక్ష విధిస్తూ ఢాకా (Dhaka) లోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (International Crimes Tribunal) ఇచ్చిన తీర్పుపై బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని హసీనా స్పందించారు. ఈ తీర్పు పక్షపాతంతో కూడినదనీ, రాజకీయ ప్రేరేపిత తీర్పు అని వ్యాఖ్యానించారు. అలాగే తనపై వచ్చిన అన్ని ఆరోపణలను హసీనా తోసిపుచ్చారు. ఎన్నికే కాని తాత్కాలిక ప్రభుత్వం తప్పుడు తీర్పు ఇప్పించడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు కోర్టులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. తన న్యాయవాదులు గైర్హాజరులో తన తరపున వాదించడానికి కూడా తనకు న్యాయమైన అవకాశం ఇవ్వ లేదన్నారు. పేరుకే ఐసీటీ తప్ప అందులో అంతర్జాతీయం ఏమీలేదని విమర్శించారు. ఎపుడూ న్యాయం జరగ లేదని ఆరోపించారు. అటు తాత్కాలిక ప్రభుత్వంలోని తీవ్రవాద శక్తుల హత్యకాండల ఉద్దేశానికి, భయానక ధోరణికి హసీనా మరణశిక్షే నిదర్శనమని అవామీ లీగ్ పార్టీ (Awami League Party) పేర్కొంది.