Charging Infrastructure : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా 72,300 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ భారీ లక్ష్యం కోసం తక్షణమే రూ. 2,000 కోట్లను ఖర్చు చేయనుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే..
దేశవ్యాప్తంగా విద్యుత్తు వాహనాల (EV) వాడకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకంతో ముందుకొచ్చింది. పీఎం ఇ-డ్రైవ్ పథకం కింద, మొత్తం 72,300 EV ఛార్జింగ్ స్టేషన్లను ₹2,000 కోట్లతో నెలకొల్పడానికి కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ ప్రాజెక్ట్, ప్రభుత్వ కార్యాలయాలు, నివాస సముదాయాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు వంటి వివిధ చోట్ల EV ఛార్జింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి 100% సబ్సిడీ ఇస్తుంది. ముఖ్యంగా ఈ స్టేషన్లు ఎవరైనా స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది.
ఈ పథకం కోసం 10 వేల కోట్లు..
ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.10,900 కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. ఉచిత ఛార్జర్లను అందించే నిబంధనకు అంగీకరిస్తే ప్రభుత్వానికి చెందిన కార్యాలయాలు, రెసిడెన్షియల్ కాంప్లెక్సులు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు ఉన్న ప్రదేశాల్లో ఈవీ ఛార్జింగ్ పరికరాలపై 100 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు.

ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారో తెలుసా..?
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో.. అంటే హైవేల వెంట ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ప్రదేశాలలో ప్రాంతాల వారీగా రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు (ఏఏఐ నిర్వహణలో), ప్రభుత్వ రంగ సంస్థల రిటైల్ అవుట్‌లెట్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, మున్సిపల్ పార్కింగ్ స్థలాలు, నౌకాశ్రయాలు, టోల్ ప్లాజాలు, జాతీయ రహదారులు/ఎక్స్‌ప్రెస్ వేల దగ్గర EV మౌలిక వసతలకు 80% సబ్సిడీ, EV పరికరాలకు 70% సబ్సిడీ ఇవ్వబడుతుంది. అలాగే, నగరాల్లో ప్రధాన రహదారులు, షాపింగ్ మాల్స్, మార్కెట్ కాంప్లెక్స్‌లు, జాతీయ రహదారుల దగ్గర EV మౌలిక వసతులకు 80% సబ్సిడీని అందిస్తారు. బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు మరియు బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్ల మౌలిక వసతలకు కూడా 80% సబ్సిడీ అమలు అవుతుంది.

దేశంలో EV adoption దే హవా..
ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రధాన ఏజెన్సీగా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) వ్యవహరిస్తుంది. 10 లక్షల మందికి పైగా నివసించే నగరాలు, స్మార్ట్ సిటీస్, మెట్రోతో అనుసంధానమైన శాటిలైట్ టౌన్స్, రాష్ట్ర రాజధానులు మరియు ప్రజలు ఎక్కువగా రాకపోకలు చేసే రహదారులు ప్రాధాన్యం పొందుతాయి. ఈ పథకం దేశంలో EV adoption ని వేగవంతం చేయడానికి, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి, పర్యావరణాన్ని కాపాడడానికి దోహదపడుతుంది. విద్యుత్తు వాహనాల వాడకం పెరుగుతూ, రవాణా వ్యవస్థ మరింత స్వచ్ఛమైనది, సుస్థిరమైనది అవుతుంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ భాగస్వామ్యాలతో కలిసి ఈ లక్ష్యాలను సాకారం చేసేందుకు పునర్వ్యవస్థీకరణలను కూడా చేపడుతోంది. పీఎం ఇ-డ్రైవ్ పథకం, EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ, బ్యాటరీ స్వాప్ స్టేషన్లు, మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో దేశంలో గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్‌కు కొత్త దిశను చూపుతుంది. ఈ వ్యూహాత్మక ప్రయత్నం, భారతదేశంలో విద్యుత్తు వాహనాల భవిష్యత్తును సుస్థిరంగా నిర్మించడంలో కీలకంగా నిలుస్తుంది.
