PF ఉద్యోగులకు గుడ్ న్యూస్..
PF ఖాతా ఉన్న ఉద్యోగులందరికీ అద్దిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంక్ అకౌంట్ మాదిరిగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) చందాదారులు సైతం ATM నుంచి తమ PF డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశం అతి త్వరలో అందుబాటులోకి రానుంది. వచ్చే ఏడాది 2026 జనవరి నుంచి ఈ సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టనుంది. త్వరలోనే జరగనున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. వచ్చే నెల అక్టోబర్ రెండో వారంలో ఈ సమావేశం జరగనుందని సమాచారం. ఇందులో తుది నిర్ణయం వెలువడనున్నట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ కథనాలు ప్రచురించాయి.

ఇక విషయంలోకి వెళ్తే..
ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ భారీ శుభవార్త అందించింది. ఇకపై తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) డబ్బులు డైరెక్టుగా ATM లేదా UPI ద్వారా విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించేందుకు EPFO 3.0 ప్లాట్‌ఫామ్‌ను త్వరలో ప్రారంభించనుంది. ఇప్పటి వరకు PF విత్ డ్రా కోసం ఆన్‌లైన్ ఫారమ్‌లు, క్లెయిమ్ ప్రాసెస్ వంటి పద్ధతులు తప్పనిసరై ఉండేవి. అయితే ఈ కొత్త సిస్టమ్ ప్రారంభమైన తర్వాత, బ్యాంక్ ఖాతా నుండి డబ్బు తీసుకున్నట్లుగానే సులభంగా PF విత్‌డ్రా చేయొచ్చు.
అకౌంట్ యాక్టివేట్ చేసుకునే విధానం..
దీనికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేట్ చేయడం, ఆధార్, PAN, బ్యాంక్ ఖాతాలను లింక్ చేయడం తప్పనిసరి అవసరం. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఉద్యోగులకు ATM కార్డ్ తరహా ప్రత్యేక కార్డు EPFO ద్వారా జారీ చేస్తుంది. దీన్ని ఉపయోగించి ఏ ATMలోనైనా PF నిధులను డైరెక్ట్‌గా విత్‌డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా, Google Pay, PhonePe, Paytm వంటి UPI యాప్‌ల ద్వారా కూడా వెంటనే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. మొదట ఈ సర్వీసును 2025 మే–జూన్‌లోనే ప్రారంభించాలనుకున్నారు. అయితే టెక్నికల్ టెస్టింగ్, సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యం అయింది. తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ రెండవ వారంలో కార్మిక, ఉపాధి మంత్రి మాన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరగనుంది. ఇందులో EPFO 3.0పై చర్చించి నవంబర్–డిసెంబర్‌లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందులో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏటీఎం విత్‌డ్రాయల్ సదుపాయం జనవరి 2026 తర్వాతే రావొచ్చు. ఇతర అన్ని సదుపాయాలు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్, ఇంటి నుంచే సవరణలు, ఓటిపి సర్వీసులు వినియోగదారులకు అనువుగా మారనున్నాయి.

ఈ ప్లాట్‌ఫామ్‌తో ఉద్యోగులకు కేవలం విత్ డ్రా చేసుకోవడమే కాకుండా, అకౌంట్ ను సరిచేసుకోవడం, డేటా అప్డేట్, ఫిర్యాదుల పరిష్కారం, క్లెయిమ్ ప్రాసెస్ వంటి సౌకర్యాలు కూడా డైరెక్ట్‌గా అందుబాటులోకి వస్తాయి.
ఉదాహరణకు, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, చిరునామా వంటి లోపాలను ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే సరిచేసుకోవచ్చు. పాత విధానంలో ఉన్నట్లుగా పేపర్ ఫారమ్‌ల అవసరం ఉండదు. OTP ద్వారా సులభంగా ధృవీకరణ జరుపుకోవచ్చు. అంతేకాదు, EPFO 3.0లో మరో కీలక అంశం కనీస పెన్షన్ పెంపు గురించి. ప్రస్తుతం నెలవారీ పెన్షన్ రూ.1,000గా ఉండగా, దీన్ని రూ.1,500 నుండి రూ.2,500 వరకు పెంచే ప్రతిపాదనపై కూడా చర్చ జరుగుతోంది. ఇది లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఊరటనిచ్చే అంశమని చెప్పుకోవచ్చు.

EPFO ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం ఇన్ఫోసిస్, విప్రో, TCS వంటి ప్రముఖ ఐటీ కంపెనీలను ఎంపిక చేసింది. బ్యాంకులు, RBIతో ATM సౌకర్యాలపై ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. దీంతో త్వరలోనే ఉద్యోగులు తమ PF నిధులను అత్యవసర పరిస్థితుల్లో ATM కార్డు లేదా UPI ద్వారా వెంటనే పొందగలరు.