- బ్రెయిన్‌ని తింటున్న అమీబా
- కేరళ ని వణికిస్తున్న వింత జీవి..
- అప్పుడు కరోనా.. ఇప్పుడు అమీబా..
- కేరళ లో మనిషిని తినేస్తున్న అమీబా..
- ఈ ఏడాది 61 కేసులు.. 19 మంది మృతి..
- నిల్వ ఉన్న నీటి నుంచే.. వైరస్ వ్యాప్తి..
- సాధారణ జ్వరం, తలనొప్పి లక్షణాలతో మొదలయ్యే ప్రాణాంతక వ్యాధి..
- ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేరళ ఆరోగ్య శాఖ హెచ్చరిక
- కేరళ లోని నీటి వనరుల నమూనాలను సేకరించి పరీక్షిస్తున్న అధికారులు
కేరళలో కంటికి కనిపించని అమీబా ఒకటి.. ఆ రాష్ట్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ప్రస్తుతం కేరళలో.. మెదడును తినే అమీబా కేసులు కలకలం రేపుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘మెదడును తినే అమీబా’ గా పిలిచే ఒక ప్రాణాంతక ఇన్ఫెక్షన్ ఇప్పుడు కేరళ రాష్ట్రాన్ని చిరుగుటాకులా వణికిస్తోంది. ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ (పామ్) అనే ఈ మెదడు వ్యాధి కారణంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు 61 కేసులు నమోదు కాగా, అందులో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొద్ది వారాలుగా మరణాల సంఖ్య పెరగడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ హై అలర్ట్ ప్రకటించింది.
ఇక విషయంలోకి వెళ్తే..
కేరళ రాష్ట్రం ప్రస్తుతం ఓ వింత జీవిని ఎదుక్కొంటుంది. గతంలో కరోనాను ఎదుర్కొన్నట్లు గానే.. ప్రస్తుతం మరో జీవితో కేరళ యుద్దం చేయాల్సి వస్తుంది. గతంలో కేవలం కోజికోడ్, మలప్పురం తదితర జిల్లాల్లోని ఉన్న ఈ ఇన్ఫెక్షన్లు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించింది. ప్రస్తుతం బాధితుల్లో మూడు నెలల శిశువు నుంచి 91 ఏళ్ల వృద్ధుడు కూడా ఉండటం గమనార్హం. రెండు రోజుల కిందట తిరువనంతపురానికి చెందిన 17 ఏళ్ల అబ్బాయి దీని బారినపడినట్టు అధికారులు ధ్రువీకరించారు. బాధిత టీనేజర్ తన ఫ్రెండ్స్‌తో కలిసి అక్కూలం టూరిస్ట్ విలేజ్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేశాడు. ఆ మర్నాడే బాలుడికి వ్యాధి లక్షణాలు బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ స్విమ్మింగ్ పూల్‌ను మూసివేసి, నమూనాలను పరీక్షల కోసం పంపారు. తాజాగా కేరళ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం ‘పామ్’ అనేది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. పలు సందర్భాలలో ఇది తీవ్రమైన మెదడు వాపు, మరణానికి దారి తీస్తుంది. ఇది సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న పిల్లలు, టీనేజర్ల కు యువకులకు మాత్రమే సోకుతుంది. కాగా ప్రస్తుతం తాము తీవ్రమైన ప్రజారోగ్య సవాలుతో పోరాడుతోందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు.
- ఇక ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది..?
- అసలు ఈ వ్యాది లక్షణాలు ఏంటి..?
- ఈ వ్యాధి సోకితే.. ఏలాంటి జాగ్రత్తులు తీసుకోవాలి..?
ఈ మెదడును తినే అమీబా ఎక్కువగా నీటి నుంచి వ్యాప్తిస్తుంది. నిల్వ ఉన్న నీళ్లు, మురికి నీటి కుంటలు, పశువులను శుభ్రం చేసే జలాశయాల్లో నివసిస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇది సాధారణంగా చెరువులు, సరస్సులు, బావులు వంటి మంచినీటి వనరులలో నివసిస్తుంది. కలుషితమైన నీటిలో ఈత కొట్టడం, స్నానం చేయడం లేదా మునకలు వేయడం వంటి పనులు చేసినప్పుడు, ఈ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి నేరుగా మెదడుకు చేరుకుంటుంది. అక్కడ మెదడు కణజాలాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తుంది. దీనివల్ల మెదడులో తీవ్రమైన వాపు ఏర్పడి, అధిక శాతం కేసులలో మరణానికి దారితీస్తుంది. అయితే, కలుషిత నీటిని తాగడం వల్ల ఈ వ్యాధి రాదని, ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి నిల్వ ఉన్న ప్రదేశాల్లో.. కనీసం ముఖం కూడా కడుక్కోవద్దు… బావుల్లో శాస్త్రీయంగా క్లోరినేషన్ ప్రక్రియ నిర్వహించాలి. నేగ్లేరియా ఫౌలరీ అనే సూక్ష్మజీవి వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ప్రభుత్వ సిబ్బంది.. వాటర్ థీమ్ పార్కులలోని ఈత కొలనుల్లో సరైన మోతాదులో క్లోరిన్ కలపాలి’ అని పేర్కొన్నారు. ఈ అమీబా ముక్కు, చెవులు ద్వారా మెదడులోకి ప్రవేశిస్తోంది. కాబట్టి స్నానం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి హెచ్చరించారు. ‘గతేడాది లా కాకుండా ఈసారి ఒక్కటే నీటి వనరుకు సంబంధించిన క్లస్టర్లు కనిపించడం లేదు.. ఇవన్నీ వేర్వేరు కేసులు. దీని వల్ల వ్యాధి వ్యాప్తిపై అధ్యయనం క్లిష్టంగా మారింది’ అని అన్నారు.
ఈ వ్యాధి లక్షణాలు సాధారణ మెదడువాపు వ్యాధిని పోలి ఉంటాయి. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలతో ఇది మొదలవుతుంది. వ్యాధిని ముందుగా గుర్తించడం చాలా కష్టం కాబట్టి, చికిత్స ఆలస్యమై ప్రాణాల మీదకు వస్తోంది. సరైన సమయంలో వ్యాధిని నిర్ధారిస్తే ప్రత్యేక మందులతో ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. నిల్వ ఉన్న నీటిలో, శుభ్రంగా లేని చెరువులు, సరస్సులలో స్నానం చేయవద్దని హెచ్చరించింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈత కొట్టాల్సి వస్తే ముక్కుకు క్లిప్స్ పెట్టుకోవాలని సూచించింది. బావులు, నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం సహకారంతో ఆరోగ్య శాఖ అధికారులు వివిధ ప్రాంతాల్లోని నీటి నమూనాలను సేకరించి పరీక్షిస్తున్నారు. నిల్వ నీటితో సంబంధం ఏర్పడిన తర్వాత జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రభుత్వం ప్రజలను కోరింది.