- కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్ ..?
- కామారెడ్డిపై జల ప్రళయం..
- జలదిగ్బంధంలో కామారెడ్డి..
- వినాయకచవితి పర్వదినం వేళ.. కుండపోత వర్షాలు..
- కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన భారీ వర్షాలు..
- పికల్ లోత్తులో మునిగిపోయిన కామారెడ్డి ప్రజలు..
- కల్యాణి వాగులో చిక్కుకుపోయిన ఆరుగురు కార్మికులు..
- వాటర్ ట్యాంకర్‌పైకి ఎక్కి సహాయం కోసం అర్ధనాధాలు..
- కామారెడ్డిలో నిలిచిపోయిన రైలు సర్వీసులు
- రెండు రైళ్లు రద్దు, మరో నాలుగు దారి మళ్లింపు..
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వినాయకచవితి పర్వదినం వేళ కుండపోత వర్షాలు కురుస్తుండటంతో పండుగ వాతావరణం లేకుండా పోయింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా.. కురిసిన కుండపోత వర్షం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తిమ్మారెడ్డి వద్ద ఉన్న కల్యాణి వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో, బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఆరుగురు కార్మికులు వరద నీటిలో చిక్కుకుపోయారు. ప్రాణాలను కాపాడుకునేందుకు వారు సమీపంలోని డీసీఎం వాహనంపై ఉన్న వాటర్ ట్యాంకర్‌పైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తు ఆర్తనాదాలు చేస్తున్నారు. మరోవైపు, ఈ భారీ వర్షాల ప్రభావం రైల్వే వ్యవస్థపై కూడా తీవ్రంగా పడింది. కామారెడ్డి-భిక్కనూర్ మధ్య రైలు పట్టాల కింద మట్టి కొట్టుకుపోయి పెద్ద గండి పడింది. పలుచోట్ల రైలు మార్గంపై వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యగా హైదరాబాద్-కామారెడ్డి మార్గంలో రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఇక కామారెడ్డిలో కురుస్తున్న భారీ వర్షాలకు హౌసింగ్ బోర్డ్ కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. కామారెడ్డి పట్టణ పోలీసులు రంగంలోకి దిగి 60 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కామారెడ్డి వ్యాప్తంగా.. రోడ్లన్నీ జలమయమవ్వడంతో వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 గంటల్లో 8 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లల్లో సురక్షితంగా ఉండాలని, ఎవరూ బయటకు రావద్దని. ముఖ్యంగా పిల్లలు వినాయక మంటపాలకు వెళ్లేటపుడు తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో లైటింగ్ సెట్లు, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.