హిమాచల్ ప్రదేశ్ పై మళ్లీ ప్రకృతి ప్రకోపాన్ని చూపించింది. భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వరదల వల్ల కిరాట్పూర్-మనాలీ జాతీయ హైవేపై నష్టం జరిగింది. దీంతో మండీ, మనాలీ లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల .. బియాస్ నది ఉగ్రరూరపం దాల్చింది. దాని ఉప నదులు సైతం ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఎమర్జెన్సీ చర్యలు చేపడుతున్నారు. జాతీయ రహదారి పలు ప్రదేశాల్లో బ్లాక్ అయ్యింది.

దీంతో మండీ జిల్లాలో 40 దుకాణాలున్న రెండు భవనాలు కూలిపోయాయి. అదృష్టవశాత్తు, ముందుగానే ఖాళీ చేయించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కిన్నౌర్ జిల్లా కన్వి గ్రామంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. శిమ్లాలో వర్షాల కారణంగా భూస్కలనం, రహదారుల మూసివేతలు చోటుచేసుకోవడంతో జిల్లా కలెక్టర్ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వాతావరణ శాఖ కాంగ్రా, చంబా, లాహౌల్-స్పితి జిల్లాలకు ఎరుపు అలర్ట్, యూనా, హమీర్‌పూర్, బిలాస్పూర్, సోలన్, మండీ, కుల్లు, శిమ్లా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జూన్ 20 నుండి ఇప్పటివరకు వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 156 మంది ప్రాణాలు కోల్పోగా, 38 మంది అదృశ్యమయ్యారని రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించింది.

మనాలీ సమీపంలో ఉన్న బిందు ధంక్ వద్ద బియాస్ నది వరద నీటికి జాతీయ హైవే కొట్టుకుపోయింది. దీంతో పాపులర్ టూరిస్టు కేంద్రానికి రాకపోకలు తెగిపోయాయి. మనాలీలో నది సమీపంలో ఉన్న ఓ హోటల్.. ఆ వరదలో కొట్టుకుపోయింది. మండి, కుల్లు ప్రాంతాల్లో డేంజర్ మార్క్ దాటి నది ప్రవాహిస్తున్నది. లోతట్టు ప్రాంతాల్లో జీవిస్తున్న వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. బహంగ్, అలూ గ్రౌండ్ ప్రాంతాల నుంచి జనాలను తరలిస్తున్నారు. మరో 24 గంటల పాటు నది సమీపానికి వెళ్లవద్దు అని టూరిస్టులకు అధికారులు వార్నింగ్ ఇచ్చారు.
