ప్రస్తుత సమాజంలో.. యూత్ అందరు కూడా సోషల్ మీడియా (Social media) మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నిజంగా మాట్లుడుకుంటే.. చిన్న చిన్న పిల్లలపై కూడా సోషల్ మీడియా ప్రభావం భారీగా పడింది. ఇక యువత గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఫేస్బుక్ (facebook,) ఇన్స్టాగ్రామ్ (Instagram), యూట్యూబ్ (Youtube) లో వ్యూస్ కోసం ఎంతకైనా దిగజారుతున్నారు.. ఎంతకైనా తెగిస్తున్నారు.
ఫేమస్ (famous) కావాలనే ఉద్దేశంతో కొందరు ప్రమాదకరమైన రీతిలో రీల్స్ (Reels) చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు కూడా తన యూట్యూబ్ ఛానెల్ (YouTube channel) కోసం వీడియో తీయాలని ప్రయత్నించి ప్రమాదంలో చిక్కుకున్న ఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో చోటుచేసుకుంది. ఒడిశాకు (Odisha) చెందిన సాగర్ (Sagar) అనే యువ యూట్యూబర్ తన స్నేహితులతో కలిసి కోరాపుట్ జిల్లాలోని డుడుమా జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లాడు. ప్రకృతి అందాలు చూసిన సాగర్ వాటిని వీడియో తీసి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయాలని భావించాడు.
అంతటితో ఆగకుండా, మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు జలపాతానికి సమీపంలోని నీటిలోకి దిగాడు. ఈ క్రమంలో అతని స్నేహితులు వీడియో చిత్రీకరణలో ఉన్నారు. కానీ అనుకోని ఘటన ఒక్కసారిగా జరిగిపోయింది. సాగర్ నీటిలో ఉన్న సమయంలో ఊహించని విధంగా జలపాతంలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. బయటకు రావాలని అనుకున్న అతను ప్రవాహానికి కొట్టుకొని పోయాడు. అతన్ని కాపాడేందుకు స్నేహితులు చాలా ప్రయత్నించినా, రక్షించలేకపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సాగర్‌ను గల్లంతైనట్టు గుర్తించిన పోలీసులు మరియు రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని శోధన చర్యలు ప్రారంభించాయి. కాగా, ఈ ప్రమాదం జరిగిన దృశ్యాలు అక్కడే ఉన్న వారు తీసిన వీడియోల ద్వారా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.