Heavy Rain | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ని భారీ వర్షం ముంచెత్తింది. ఇవాళ తెల్లవారుజామున కురిసిన ఎడతెరిపి లేని కుండపోత వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఈ వర్షబీభత్సానికి కల్కాజీ (Kalkaji) ప్రాంతంలో ఓ బైక్‌పై భారీ చెట్టు కూలిపోయింది (tree crashes on bike). ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. సమీపంలోని మరో వాహనం కూడా దెబ్బతిన్నది.కాగా, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో గురువారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందు రాజధానిలోని కీలక ప్రాంతాలు జలమయం కావడంతో అనేక అండర్‌పాస్‌లు నీటమునిగాయి. మరోవైపు ఢిల్లీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గత 24 గంటల్లో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌లోని ప్రాథమిక వాతావరణకేంద్రంలో 13.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆయా నగర్‌లో 57.4మి.మీ, పాలెంలో 49.4 మి.మీ, లోధి రోడ్డులో 12 మి.మీ, ప్రగతి మైదాన్‌లో 9 మి.మీ, పూసాలో 5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ (IMD) తెలిపింది. వర్షం కారణంగా ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 23.6 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గినట్లు ఐఎండీ తెలిపింది. ఇది సాధారణం కంటే 3.2 డిగ్రీలు తక్కువ. అదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.