ప్రస్తుతం సమాజంలో… పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అందులో ముఖ్యంగా.. యూట్యూబ్ పై పిల్లల ప్రభావం చాలా ఉంది. దీంతో 16 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకు యూట్యూబ్ ఖాతాలను తెరవకుండా.. ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలకు యూట్యూబ్ ను నిషేధించింది. 16 ఏళ్లలోపు పిల్లలు ఇకపై యూట్యూబ్ ఖాతాలను తెరవడానికి వీలు లేదు. డిసెంబర్ నెల నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. ఇప్పటికే టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా వేదికల విషయంలో ఆస్ట్రేలియా ఇలాంటి నిబంధనలనే అమలు చేస్తోంది. ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మాట్లాడుతూ, డిజిటల్ ప్రపంచంలో పిల్లల భద్రత తమ ప్రభుత్వానికి చాలా ముఖ్యమని చెప్పారు.
ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశ్యం పిల్లలను ఆన్‌లైన్ ప్రమాదాల నుంచి కాపాడటమే. సైబర్‌బుల్లీయింగ్, అవాంఛనీయ కంటెంట్ ప్రభావాలకు గురికావడం, సోషల్ మీడియా ఎక్కువగా వాడటం వల్ల వచ్చే మానసిక ఆరోగ్య సమస్యల నుంచి పిల్లలను రక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. యూట్యూబ్ వీడియోల ప్లాట్‌ఫామ్ అయినప్పటికీ, సాధారణ సోషల్ మీడియాలో ఉండే నష్టాలు ఇక్కడ కూడా ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఆన్‌లైన్‌లో హానికరమైన కంటెంట్‌ను చూసిన పిల్లల్లో 37 శాతం మంది యూట్యూబ్‌లోనే దాన్ని చూసినట్లు తేలింది. మైనర్‌లు యూట్యూబ్‌లో అకౌంట్ లేకుండా వీడియోలు చూడొచ్చు, కానీ వారికి పర్సనల్ సిఫార్సులు, వీడియోలు పెట్టడం, కామెంట్ చేయడం వంటి సదుపాయాలు ఉండవు. ఇక ఆస్ట్రేలియా ప్రజల్లో పది మందిలో తొమ్మిది మంది ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. భవిష్యత్తులో ఇతర దేశాలు కూడా ఇలాంటి భద్రతా చర్యలను అమలు చేస్తే మంచిదని పలువురు పిలుపునిస్తున్నారు.