గ్రాండ్ సక్సెస్..
NISAR Mission Launched : భారత్, అమెరికా (India, America) కలిసి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “నిసార్ ” (NISAR) ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. ఇవాళ సాయంత్రం 5:40 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC SHAR) నుంచి ఈ రాకెట్ విజయవంతంగా కక్షలోకి ప్రవేశ పెట్టారు. దాదాపు 2,392 కిలోల బరువున్న ‘NISAR’ శాటిలైట్‌ను మోసుకుని ‘GSLV-F16’ నింగిలోకి దూసుకువెళ్లింది. ఈ రాకెట్ ‘NISAR’ ఉపగ్రహాన్ని 98.40 వంపుతో 743 కిలోమీటర్ల సూర్య-సమకాలిక కక్ష్య(SSO)లోకి ప్రవేశపెట్టింది. అంతరిక్ష రంగంలోనే సంచలనాలకు కేరాఫ్ గా మారింది ఇస్రో. తక్కువ ఖర్చుతో ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేసి విజయవంతమైన ఇస్రో.. ఇప్పుడు జీఎస్ఎల్ వీ ఎఫ్ 16 రాకెట్ ను రోదసిలోకి పంపింది. ఈ రాకెట్ తన కక్షలోకి చేరుకున్నాకా.. అంతరిక్షం నుంచి భూమిని అణువణువు 12 రోజులకు ఒకసారి స్కాన్ చేయనుంది. నిసార్ ఉపగ్రహం ఈ భూమండలంపై ఉన్న అడవులు, మైదానాలు, కొండలు, పర్వతాలు, పంటలు, జల వనరులు, మంచు ప్రాంతాలు అన్నింటిని నిసార్ ఉపగ్రహం అధ్యయనం చేయనుంది. ఇందులో నాసాకి చెందిన ఎల్-బ్యాండ్, ఇస్రోకి చెందిన ఎస్-బ్యాండ్ రాడార్లను శాస్త్రవేత్తలు అమర్చారు.

ప్రాజెక్టు వ్యయం ఎంతో తెలుసా..?
ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.12,525 కోట్లు. నిసార్ ఉపగ్రహాన్ని (Nisar satellite) 747 కిలోమీటర్ల ఎత్తులోని సూర్య అనువర్తిత కక్ష్యలోకి పంపుతారు. 90 రోజుల తర్వాత పని ప్రారంభిస్తుంది. రాత్రి, పగలు తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో ఫోటోలను తీసే సామర్థ్యంతో డిజైన్ చేశారు. నిసార్ ఉపగ్రహం ప్రాంతాల వారీగా భూమిని పరిశీలన చేస్తుంది. ఒకసారి 240 కిలోమీటర్ల వెడల్పున్న ప్రదేశాన్ని పరిశీలిస్తుంది. దాని చిత్రాల స్పష్టత 10 మీటర్లుగా ఉంది. 97 నిమిషాల కోసారి భూమిని చుట్టేస్తుంది.

సూర్య-సమకాలిక కక్ష్య (SSO) అంటే?
SSO అనేది దాదాపు ధ్రువ కక్ష్య (polar orbit). దీనిని హీలియోసింక్రోనస్ ఆర్బిట్ (Heliosynchronous orbit) అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఒక ఉపగ్రహం ప్రతిరోజూ ఒకే స్థానిక సమయంలో భూమిపై పాయింటవుట్ చేసిన బిందువు మీదుగా వెళుతుంది. ఈ సూర్య-సమకాలిక కక్ష్య ఇమేజింగ్, నిఘా, వాతావరణ ఉపగ్రహాలకు ఉపయోగపడుతుంది.

ఈ శాటిలైట్ తో ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసా.. ?
- ధ్రువ ప్రాంతాల్లో మంచు ఫలకాల కదలికలు, కరుగుదలను నిసార్ పరిశీలించగలదు.
- అగ్నిపర్వత విస్పోటాలు, కొండ చరియలు విరిగిపడటం వంటి విపత్తులను కూడా పరిశీలిస్తుంది.
- తుపాన్లు, సునామీలు, వరదలు, కార్చిచ్చు వంటి విపత్తుల సమయంలో సహాయ చర్యలకు సాయపడుతుంది.
- నిర్దిష్ట ప్రాంతంలో నేల ఒక అంగుళం కుంగినా గుర్తించగలదు.
- వంతెనలు, డ్యామ్ లలో లోపాలనూ పసిగడుతుంది.
- అటవీ విస్తీర్ణం, పచ్చదనంలో మార్పులు, పంటల ఎదుగుదల, నేలలో తేమ పరిశీలన ద్వారా ఉపరితల జలాలు, చిత్తడి నేలల్లో మార్పులను ఈ నిసార్ ఉపగ్రహం పసిగడుతుంది.
- నీటి వనరుల నిర్వహణకు ఈ ఉపగ్రహం దోహపడుతుంది. తద్వారా రైతులు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది.