అంటార్కిటికా.. ఈ ఖండం పేరు వినగానే మనకు గుర్తొచ్చేది మంచు..ఎటుచూసిన కనుచూపు మేర మంచు. కాని ఇప్పుడు ఈ మంచుఖండం అంతుచిక్కని రహస్యాలకు నిలయంగా మారింది. గతంలో ఇక్కడ కనుగొన్న అదృశ్య నది సైంటిస్టులనే కలవరం పెట్టిన విషయం మరువక ముందే.. ఇప్పుడు ఆదే మంచు కింద 85 ఉప నదుల సరస్సులు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. కాగా ఆ సరస్సులు ఏంటీ..? ఈ సరస్సుల వల్ల ఏమైనా ప్రమాదం ఉందా.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి.
85 ఉప-హిమానీనద సరస్సులు..

అంటార్కిటికా.. మానవాళికి దూరంగా హిమానీ నదాలు, మంచు పర్వతాలతో నిండిపోయిన మంచు ఖండం.. ఇక్కడి పర్యావరణ, జీవావరణ వ్యవస్థ గురించి లోతైన పరిశోధనలు జరుగుతున్నాయి. చుట్టూ ఉన్న మంచుతో నిండిపోయిన సముద్రం కూడా అద్భుతమైన జీవ రహస్యాలను తన గుండెల్లో దాచుకుంది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద మంచుఖండంలో గతంలో శాస్త్రవేత్తలు ఓ అదృశ్య నదిని కనుగొన్నారు. గ్లోబల్ వార్మింగ్‌తో ఇప్పటికే మంచు వేగంగా కరిగిపోతోందని ఆందోళన వ్యక్తమవుతోన్న ఈ సమయంలో.. ఈ సీక్రెట్ రివర్ జాడలు తెలియడం మరింత కలవరానికి గురిచేస్తోంది. అదృశ్య నది వల్ల రాబోయే రోజుల్లో ఎదురయ్యే విపత్తులు ఏమిటనే దానిపై విస్త్రత చర్చ జరుగుతోంది. ఇది కాకుండా అదే అంటార్కిటికాలోని దట్టమైన మంచు పలకల కింద ఇప్పుడు మరో 85 ఉప-హిమానీనద సరస్సులు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.
231 చేరిన సరస్సుల సంఖ్య..

దీంతో ఈ ప్రాంతంలో ఉన్న మొత్తం క్రియాశీలక సరస్సుల సంఖ్య 231కు చేరుకుంది. ఈ విషయాన్ని నేచర్ కమ్యూనికేషన్స్ తన జర్నల్‌లో ప్రచురించింది. హిమానీ నదుల కదలికలో, అంటార్కిటిక్ ఐస్ షీట్‌ను స్థిరంగా ఉంచడంలో ఈ సరస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని వెల్లడించింది. దక్షిణ ధ్రువ ఉపరితలానికి కొన్ని కి.మీ. దిగువన కొత్త సరస్సులు ఉన్నాయని స్పష్టం చేసింది. ఐదు సరస్సులు ఒకదానితో మరొకటి ఎలా కలిసి ఉన్నాయన్న అంశంతో పాటు… కొత్త నీటి ప్రవాహ మార్గాలను ఈ పరిశోధనలో కనుగొన్నట్లు నేచర్ కమ్యూనికేషన్స్ అధికారులు తెలిపారు.
460 కిలో మీటర్లు నది ప్రవాహం..

ఇక ఇదే కాకుండా.. గతంలో బయటపడ్డ అదృశ్య నది కూడా ఇప్పుడు ప్రపంచాని కలవరం పెడుతుంది. యూకే, కెనడా, మలేషియా శాస్త్రవేత్తలు కలిసి ఏరియల్ సర్వే ద్వారా అంటార్కిటికాను పరిశోధించినప్పుడు ఈ అదృశ్య నది ఉన్న విషయం బయటపడింది. అంటార్కిటికాలోని మంచు పలకల కింద సుమారు 460 కిలోమీటర్లు ఇది ప్రవహిస్తోందని గుర్తించారు. గతంలో లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులు చేసిన అధ్యయనం ద్వారా మంచుపలకల కింద పెద్ద పెద్ద సరస్సులు ఉన్నాయని ఇప్పటి వరకు అనుకునేవారు. అయితే ఇప్పుడు ఆ సరస్సులే నదిగా మారి ఉంటాయని భావిస్తున్నారు. మంచు కరిగి నదిగా ఏర్పడొచ్చని అంచనా వేస్తున్నారు.
ఆ అదృశ్య నదులు బయటపడేందుకు.. గ్లోబల్ వార్మింగ్ కారణమా..?

అంటార్కిటికా మంచు పొరల కింద ఉన్న భూమితో రాపిడి వల్ల కాని.. పైన మంచు కరిగి పగుళ్ల ద్వారా నీరు కిందకు వెళ్లడం ద్వారా కాని ఈ నది ఏర్పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే మంచుపొరల కింద ఉన్న నదీ ప్రవాహం క్రమక్రమంగా పెరగడం వల్ల కలిగే దుష్పరిణామాలపై ఆందోళన వ్యక్తం అవుతోంది. నదిలోని వేడి నీళ్ల ప్రవాహం.. మంచు పలకలను కింద నుంచి వేగంగా కరిగించే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. దీని వల్ల అంటార్కిటికలో అన్యూహ్యమైన మార్పులు చోటుచేసుకునే పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ వల్ల అంటార్కిటికాలో మంచు కరిగిపోతోందని ఆందోళన వ్యక్తమవుతోంటే.. ఇప్పుడు ఈ నది వల్ల ఆ ప్రభావం మరింత ఎక్కువయ్యే అకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు పరిశోధకులు.